Cholesterol | రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే గుండెకు ఎంతో కీడు చేస్తాయి. మనం తినే ఆహారాల వల్లే చాలా వరకు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పేరుకుపోతుంటాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, శాచురేటెడ్ కొవ్వులను అధికంగా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ పేరుకుపోయి దాంతో గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ బారిన పడతారు. అలాగే ఫైబర్ తక్కువగా తిన్నా కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజువారి దినచర్యలో భాగంగా తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయట పడవచ్చ. పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. దీంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
మనం ఆహారంలో భాగంగా వెల్లుల్లిని అప్పుడప్పుడు తింటుంటాం. అయితే శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ లెవల్స్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని రోజూ ఉదయం పరగడుపునే 2 రెబ్బలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం వెల్లుల్లి మన శరీరంలో ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను, ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గించగలదు. కనుక దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లి మన శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కనుక రోజూ పరగడుపునే 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తినడం అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మనం తరచూ అల్లాన్ని కూడా వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని పలు రకాల కూరలు, సూప్స్తోపాటు టీలోనూ వేస్తుంటాం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అల్లం గుండె సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం అల్లం శరీరంలోని ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తుంది. ఓవరాల్‌గా లిపిడ్ ఫ్రొఫైల్స్‌ను మెరుగు పరుస్తుంది. కరెంట్ ఫార్మాసూటికల్ డిజైన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజూ అల్లాన్ని ఏదో ఒక విధంగా తింటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
పసుపును కూడా మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. ఇది కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించగలదు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల పసుపును తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో మెంతులు కూడా ఎంతో పనిచేస్తాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మేలు జరుగుతుంది. అదేవిధంగా దాల్చినచెక్క నీళ్లను తాగుతున్నా కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది.