Fish | చేపల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. చేపల్లో మన శరీరానికి కావల్సిన అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. చేపల్లో మనకు రెండు రకాలు లభిస్తుంటాయి. సముద్రపు చేపలు, స్థానికంగా లభించే చేపలు. సముద్రపు చేపల్లోనే అధికంగా పోషకాలు ఉంటాయి. వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏ రకానికి చెందినవి అయినా సరే చేపలు మనకు ఆరోగ్య ప్రయోజనాలనే అందిస్తాయి. చేపల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, ప్రోటీన్లు, విటమిన్ డి, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు తరచూ చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
ఇతర మాంసాహారాల కన్నా చేపల మాంసం చాలా తేలిగ్గా ఉంటుంది. త్వరగా ఉడకడమే కాదు, సులభంగా జీర్ణమవుతుంది కూడా. చేపలను పట్టిన తరువాత త్వరగా పాడవుతాయి. కనుక లైవ్ ఫిష్‌ను అప్పటికప్పుడు కట్ చేయించుకుని తింటే మంచిది. సముద్రపు చేపలను పట్టిన తరువాత చాలా సమయానికి వినియోగదారులకు విక్రయిస్తారు. కనుక వీటిని కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. చేపలను కొందరు ఎండబెట్టి నిల్వ చేసి తింటుంటారు. ఇలా తీసుకున్నా కూడా పోషకాలు లభిస్తాయి. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు వచ్చే ముప్పును ఏకంగా 23 శాతం వరకు తగ్గిస్తాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. చేపలను వేయించి కాకుండా ఉడకబెట్టి లేదా పులుసు రూపంలో తింటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చేపల్లో 18 నుంచి 20 శాతం మేర ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందించడమే కాదు కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. చేపల్లో మన శరీరానికి అవసరం అయ్యే సుమారు 8 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. లైసీన్, మిథియోనిన్, సిస్టీన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లాలు లభిస్తాయి. చేపల్లో కొవ్వు చాలా తక్కువగా కేవలం 0.2 నుంచి 20 శాతం వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కొవ్వులో చాలా వరకు ఆరోగ్యకరమైన కొవ్వులే ఉంటాయి. కనుక చికెన్, మటన్ తినలేని వారు చేపలను నిర్భయంగా తినవచ్చు. చేపల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
చేపల్లో అనేక బి విటమిన్లు కూడా ఉంటాయి. థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్ అధికంగా ఉంటాయి. ఇవి రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. చేపల ద్వారా మనకు విటమిన్ ఎ సులభంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. గర్భిణీలు చేపలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పిండం ఎదుగుదలకు సహాయం చేస్తాయి. చేపలను తింటే విటమిన్ కె అధికంగా లభిస్తుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్త స్రావం అధికంగా జరగకుండా త్వరగా రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సముద్రపు చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. ఇలా చేపలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.