Coffee | ప్రతిరోజూ కాఫీ తాగడం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు సూచించాయి. స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కాఫీ సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఎంత వరకు తాగితే మంచిది? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఏదైనా పరిమితి దాటితే దుష్ప్రభావాలు తప్పవు. ఇటీవల జరిగిన ఒక భారీ స్థాయి అధ్యయనం ప్రకారం, రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగడం ఆందోళన (ఆంక్షైటీ), డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. Fudan University కి చెందిన పరిశోధకులు 4.61 లక్షలకుపైగా ఆరోగ్యవంతుల డేటాను విశ్లేషించారు. వీరిని సగటున 13.4 సంవత్సరాల పాటు పరిశీలించారు. ఈ అధ్యయనం Journal of Affective Disordersలో ప్రచురితమైంది. ఇందులో కాఫీ వినియోగం, మానసిక ఆరోగ్యానికి మధ్య J-ఆకార సంబంధం ఉందని తేలింది. అంటే మితమైన మోతాదులో కాఫీ తాగినవారికి అత్యధిక ప్రయోజనం కనిపించినట్లు స్పష్టమైంది.
రోజుకు 2-3 కప్పుల కాఫీ తాగినవారిలో ఆందోళన, డిప్రెషన్ ప్రమాదం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాఫీ తాగని వారితో పోలిస్తే రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగిన వారిలో కూడా రిస్క్ తక్కువగా ఉంది. అయితే మూడు కప్పుల కంటే ఎక్కువ తాగడం వల్ల ఇతర అదనపు ప్రయోజనం ఏమీ కనిపించలేదు. అలాగే డీకాఫ్ కాఫీ (కెఫీన్ లేకుండా) తీసుకున్నవారిలో ఈ రక్షణాత్మక ప్రభావం కనిపించలేదు. దీంతో కెఫీన్ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. పరిశోధకుల ప్రకారం కెఫీన్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్యంపై ప్రభావం, న్యూరోట్రాన్స్మిటర్లపై ప్రభావం వంటి అంశాలు మూడ్ను నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
అయితే ఈ అధ్యయనం కారణ-ఫలిత సంబంధాన్ని (cause and effect) పూర్తిగా నిరూపించలేదని కూడా వారు స్పష్టం చేశారు. మెదడు పనితీరును నేరుగా కొలవలేదు. గత దశాబ్దంలో మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద భారం అవుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి నివారణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు.