Water Apples | ఆరోగ్యాన్ని అందించే ఆహారాలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పండ్లు కూడా ఒకటి. ఈ క్రమంలోనే సీజనల్‌గా లభించే పండ్లతోపాటు మార్కెట్లో మనకు తరచూ లభించే పండ్లను చాలా మంది తింటుంటారు. పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభించడమే కాక పలు రోగాలు కూడా నయమవుతాయి. జ్వరం వచ్చిన వారు పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. పోషకాహార లోపం కూడా తగ్గుతుంది. అయితే పండ్లలో అనేక రకాల పండ్లు ఉన్నప్పటికీ కొన్ని రకాల పండ్ల గురించి చాలా మందికి తెలియదు. అవి పోషకాలను అందిస్తాయని, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని కొన్ని పండ్ల గురించి చాలా మందికి అసలు అవగాహన లేదు. అలాంటి పండ్లలో వాటర్ యాపిల్ కూడా ఒకటి. వీటినే రోజ్ యాపిల్ అని కూడా అంటారు. చూసేందుకు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా ఉండే ఈ పండ్లను తింటే అనేక లాభాలు కలుగుతాయి.
వాటర్ యాపిల్స్ లో 90 శాతం నీరు ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే శరీరానికి ద్రవాలు సరిగ్గా లభిస్తాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేడి వాతావరణంలో ఈ పండ్లు మేలు చేస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచేలా చూస్తాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వాటర్ యాపిల్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
వాటర్ యాపిల్స్‌లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల గుండెపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. వాటర్ యాపిల్ చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
వాటర్ యాపిల్స్‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది కనుక ఈ పండ్లను తింటే చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఫ్రీ ర్యాడికల్ నష్టం నుంచి రక్షిస్తాయి. దీని వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంలో కాంతి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విరేచనాల నుంచి బయట పడవచ్చు. వాటర్ యాపిల్స్‌ను నేరుగా అలాగే తినవచ్చు. కానీ తినేముందు బాగా శుభ్రం చేసి తినాలి. ఈ పండ్లను తొక్కతో సహా తినాల్సి ఉంటుంది. అప్పుడే లాభాలు కలుగుతాయి. ఇలా వాటర్ యాపిల్స్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.