Blood Sugar Levels | ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే షుగర్ సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, ఆందోళన, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు ప్రధాన కారణమవుతున్నాయని సైంటిస్టుల గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. అలాగే అతిగా భోజనం చేయడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రించడం, శారీరక శ్రమ అసలు లేకపోవడం.. వంటివి కూడా డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు అవుతున్నాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారు డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి.
మందులను వాడడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ఇక షుగర్ లెవల్స్ అదుపులో ఉండేందుకు మన వంట ఇంట్లో ఉండే పలు మసాలా దినుసులు కూడా ఎంతగానో దోహదపడతాయి. వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే జాబితాలో దాల్చిన చెక్క టాప్ 5 స్థానాల్లో నిలుస్తుంది. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుంతుంటే షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు.
చాలా మంది కారం అని చెప్పి ఎండు మిర్చిని తినరు. కానీ టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించేందుకు ఇది కూడా ఎంతగానో పనిచేస్తుంది. మిర్చిలో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. కనుక కారం అనుకోకుండా ఎండు మిర్చిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే షుగర్‌ను తగ్గించడంలో లవంగాలు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు మొదటి స్థానంలో నిలుస్తాయి. ఇవి షుగర్‌ను అద్భుతంగా తగ్గిస్తాయి. కనుక భోజనం అనంతరం చిన్న లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది.
షుగర్‌ను తగ్గించడంలో మెంతులు కూడా అద్భుతంగానే పనిచేస్తాయి. మెంతుల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటుండాలి. దీని వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది. అలాగే అల్లం కూడా షుగర్‌ను తగ్గిస్తుంది. రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు అల్లం రసం సేవిస్తుండాలి. దీంతో షుగర్ తగ్గడమే కాదు, జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే పసుపును కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. రాత్రి పూట పాలలో పసుపు కలిపి తాగుతున్నా కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇలా మన వంట ఇంట్లో ఉండే పలు దినుసులు షుగర్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.