Healthy Foods | పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పు దినుసులు, కంద మూలాలు, సుగంధ ద్రవ్యాలను మానవుడికి ప్రకృతి అందించిన వరంగా చెప్పవచ్చు. ఆయా సీజన్లలో పండే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. పూర్వకాలంగా మనం ఇలాగే ఆహారాలను తింటున్నాం. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణ ధాన్యాలను మనం ఆహారంగా తింటుంటాం. వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవనవిధానమని కూడా ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైంది. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, మినరల్స్, ఫైబర్ వంటివి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ పోషకాలను కలిగిన ఆహారాలను రక్షణ కవచాలుగా నిలిచే ఆహారాలని చెప్పవచ్చు.
శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి సీజన్ మారే సమయంలోనూ మనకు అనేక వ్యాధులు వస్తుంటాయి. అలాగే కలుషిత ఆహారం తిన్నా, నీళ్లను తాగినా కూడా వ్యాధులు వస్తుంటాయి. తరచూ మనకు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరికి అలర్జీలు కూడా ఉంటాయి. వీటన్నింటి నుంచి బయట పడాలంటే మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలి. అందుకు కొన్ని ఆహారాలు తోడ్పడుతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం వైరస్, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. టమాటా, ఆలుగడ్డలు, నారింజ, నిమ్మ, కివి, పైనాపిల్, ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలను తిరిగి పునర్నిర్మితం చేయడంలో జింక్ దోహద పడుతుంది. జింక్ మనకు గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, బీన్స్, సీఫుడ్‌లలో లభిస్తుంది. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. రోగాలు రాకుండా చూస్తుంది. ప్రతి రోజూ అర కప్పు క్యారెట్లను తినాలి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ బి6 యాంటీ బాడీ కణాల ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ యాక్టివ్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే మినరల్స్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లపై పోరాడేలా చేస్తాయి. ప్రతి రోజూ ఆహారంలో ఒక స్పూన్ వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకుంటుంటే ఆరోగ్యంగా ఉంటారు.
రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్ అందుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజం చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే అరటి పండ్లను కూడా తరచూ తినాలి. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా పలు సరైన ఆహారాలను తింటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారంలోనూ మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. రోగాలు రాకుండా శరీరం సురక్షితంగా ఉంటుంది.