Healthy Drinks | చాలా మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. కొందరు రోజు మొత్తం టీ లేదా కాఫీలను అదే పనిగా తాగుతుంటారు కూడా. అయితే టీ, కాఫీలను మోతాదుకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తాయి. శరీరంలో కెఫీన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. శరీరంలో కెఫీన్ పెరిగితే జీర్ణ సమస్యలు వస్తాయి. గుండె దడగా ఉంటుంది. బీపీ పెరిగిపోతుంది. రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదు. ఇలా శరీరంలో అధికంగా ఉండే కెఫీన్ మనకు అనేక రకాలుగా హాని చేస్తుంది. అయితే టీ, కాఫీ తాగకపోతే ఎలా..? వాటిని తాగకుండా ఎలా ఉండగలం..? అని అనుకునే వారు ఇప్పుడు చెప్పబోయే పలు డ్రింక్స్‌ను తాగవచ్చు. వీటిని టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా సేవించవచ్చు. వీటిల్లో ఎలాంటి హానికర సమ్మేళనాలు ఉండవు. కనుక ఈ డ్రింక్స్‌ను తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. కమోమిల్, పెప్పర్ మింట్, మందార పువ్వులతో చేసిన హెర్బల్ టీలను సేవిస్తుండాలి. టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా ఈ పానీయాలను సేవించవచ్చు. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. వీటిల్లో కెఫీన్ ఉండదు. ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. టీ లేదా కాఫీకి ప్రత్యామ్నాయంగా మచా టీని కూడా సేవించవచ్చు. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఈ టీని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని శక్తి స్థాయిలను పెంచుతాయి.
టీ లేదా కాఫీలకు బదులుగా పసుపు టీని కూడా తాగవచ్చు. కాస్త పసుపును నీటిలో వేసి మరిగించి తాగాల్సి ఉంటుంది. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి. పసుపు రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానేలా చేస్తుంది. దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వేసి తయారు చేసిన కషాయాన్ని టీ లేదా కాఫీకి బదులుగా తాగవచ్చు. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
కొబ్బరి నీళ్లను కూడా టీ, కాఫీలకు మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. మీకు టీ లేదా కాఫీ తాగాలని అనిపిస్తే కొబ్బరి నీళ్లను ఒక గ్లాస్ తాగండి చాలు, ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీళ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అలాగే కొబ్బరి నీళ్లను తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వేడి తగ్గి చల్లగా మారుతుంది. ఇక టీ, కాఫీలకు బదులుగా వెజిటబుల్ జ్యూస్‌ను కూడా తాగవచ్చు. కీరదోస, నిమ్మ, టమాటా, బీట్రూట్, క్యారెట్ వంటివి వేసి జ్యూస్ తయారు చేసి తాగితే మంచిది. ఈ జ్యూస్ వల్ల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి కావల్సిన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. కనుక ఈ పానీయాలను మీరు టీ లేదా కాఫీకి బదులుగా సేవించవచ్చు. ఇవి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.