Vitamin E Foods | మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. కణాలను రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక విటమిన్ ఇ ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. అయితే విటమిన్ ఇ అనగానే మనకు పలు రకాల నట్స్, విత్తనాలు గుర్తుకు వస్తాయి. కానీ వాస్తవానికి విటమిన్ ఇ పలు రకాల పండ్లు, ఇతర కూరగాయల్లోనూ ఉంటుంది. అందువల్ల ధర పెట్టి మరీ నట్స్, సీడ్స్‌ను తింటేనే విటమిన్ ఇ లభిస్తుందని అనుకుంటే పొరపాటే. పలు రకాల పండ్లు, కూరగాయలను తినడం వల్ల కూడా మనం విటమిన్ ఇ ని పొందవచ్చు. దీంతో ధర కూడా తక్కువ అవుతుంది. ఇక విటమిన్ ఇ లభించే ఆ ఆహారాలను తినడం వల్ల మనకు పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అయితే దీంతోపాటు విటమిన్ ఇ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది. ఉడికించిన ఒక కప్పు పాలకూరను తింటే మనకు సుమారుగా 4 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. ఇది మనకు రోజుకు కావల్సిన విటమిన్ ఇ లో 25 శాతం. కనుక పాలకూరను తింటుంటే విటమిన్ ఇ ని పొందవచ్చు. ఒక మీడియం సైజ్ అవకాడోను తినడం వల్ల 4.2 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. అవకాడోను మీరు రోజూ తినే ఆహారంలో చేర్చుకుని తినవచ్చు. లేదా పలు ఇతర ఆహారాలపై ఈ ముక్కలను చల్లి కూడా తినవచ్చు. అవకాడోను తినడం వల్ల మనకు అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు సైతం లభిస్తాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి క్యాన్సర్ రాకుండా చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను మీరు చూసే ఉంటారు. అయితే ఈ క్యాప్సికం విటమిన్ ఇ కి పెట్టింది పేరు. ఒక కప్పు ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను తినడం వల్ల సుమారుగా 1.9 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. అలాగే విటమిన్ సి కూడా ఈ వీటిలో ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. క్యాప్సికమ్‌ను మీరు రోజూ కూర లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. కివి పండ్లలో కేవలం విటమిన్ సి ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ పండ్లలో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఒక కివి పండును తినడం వల్ల సుమారుగా 1.1 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. కివి పండ్లను స్నాక్స్ రూపంలో తినవచ్చు. లేదా పెరుగులో కలిపి తినవచ్చు. మరీ పుల్లగా ఉన్నాయని అనుకుంటే కాస్త చక్కెర లేదా తేనె చల్లి తినవచ్చు. కివి పండ్లను తినడం వల్ల కేవలం విటమిన్ ఇ మాత్రమే కాకుండా పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
బ్రొకలిలోనూ విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు ఉడకబెట్టిన బ్రోకలిని తింటే సుమారుగా 2.3 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. బ్రోకలిని కాస్త పెనంపై వేయించి తినవచ్చు. లేదా నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలను అందిస్తుంది. టమాటాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా టమాటాలను ఎండలో ఎండబెట్టి అనంతరం తినాలి. ఇలాంటి టమాటాల్లో విటమిన్ ఇ శాతం పెరుగుతుంది. టమాటాలను ఇలా ఎండబెట్టి ఒక కప్పు మోతాదులో తింటే సుమారుగా 2.8 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. టమాటాలను రోజూ ఇలా ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. దీంతో పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలను తినడం వల్ల కూడా మనకు విటమిన్ ఇ లభిస్తుంది.