Liver Health | మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. మన శరీరంలో కాలేయం రోజంతా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం, శక్తిని ఉత్పత్తి చేయడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా అనేక రకాలుగా విధులను నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా రక్తాన్ని శుద్ది చేయడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయంపై ఒత్తిడి అధికంగా పడుతుంది. కొవ్వు, రసాయనాలు, ధూళి పేరుకుపోయి కాలేయ పనితీరును బలహీనపరుస్తున్నాయి. కాలేయ పనితీరు జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. కాలేయ పనితీరు మందగించడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం కాలేయ పనితీరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
మన ఆహారంలో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవడం వల్ల కాలేయ పనితీరు పెరగడంతో పాటు కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కూడా సాఫీగా సాగుతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని, పనితీరును పెంచే పండ్ల గురించి తెలుసుకుందాం. నారింజ, బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో గ్లూటాతియోన్ అనే సమ్మేళనం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్. ఇది శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి కాలేయ కణాలు రక్షించబడతాయి. కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తించడంలో ఆపిల్ పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆపిల్స్ లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలోని టాక్సిన్స్ ను చెడు కొలెస్ట్రాన్ బయటకు పంపించడంలో సహాయపడుతుంది. దీంతో కాలేయంపై పనిభారం తగ్గడంతో పాటు ఇతర విధులు నిర్వహించడానికి వీలును కల్పిస్తాయి.
బొప్పాయి పండు మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కాలేయ పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది. ఇందులో పపైన్, కైమోపాపైన్ అనే జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీంతో కాలేయంపై విష పదార్థాల భారం తగ్గుతుంది. బొప్పాయిని తీసుకోవడం వల్ల కాలేయ కణాల వాపు వంటి సమస్య కూడా తగ్గుతుంది. చిన్నగా ఉన్నప్పటికి కివి పండు పోషకాల నిధి అని చెప్పవచ్చు. విటమిన్ సి, ఇలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి కాలేయ కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కివి పండ్లను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడతాయి. కివి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ పండ్లను తీసుకోవడం వల్ల కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కనుక మన రోజు వారి ఆహారంలో భాగంగా పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.