Gut Health | మన శరీరంలో జీర్ణ వ్యవస్థను రెండో మెదడుగా పిలుస్తారు. ఎందుకంటే మెదడుకు, జీర్ణ వ్యవస్థకు నేరుగా సంబంధం ఉంటుంది. మనం ఎంత ఆహారం తినాలి.. వేటిని తినకూడదు.. అనే సంకేతాలను మన మెదడు జీర్ణ వ్యవస్థకు పంపిస్తుంది. కానీ మనం వాటిని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. కనుకనే ఆహారపు అలవాట్లు మారిపోయి జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఇక మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది శరీరం మొత్తానికి ఎల్లప్పుడూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కానీ రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. కనుక జీర్ణ వ్యవస్థకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలపై నియంత్రణ ఉండాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. దీంతో జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము. ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక అందుకు ఏయే ఆహారాలు పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు గాను ప్రొ బయోటిక్ ఆహారాలను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రో బయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రో బయోటిక్ ఆహారాల విషయానికి వస్తే వాటిల్లో పెరుగు మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చు. పెరుగును చాలా మంది తింటారు. ఇందులో ప్రోటీన్లు సైతం అధికంగా ఉంటాయి. అయితే పెరుగును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కానీ కొందరు పెరుగులో చక్కెర కలిపి తింటారు. అలా ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. కేవలం ఉప్పుతో మాత్రమే తినాలి. చక్కెరతో పెరుగును కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాకు హాని జరుగుతుంది. చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. కనుక పెరుగుతో చక్కెర కలపకుండానే తినాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
కొంబుచా అనే ఓ ప్రత్యేకమైన హెర్బల్ టీ కూడా ప్రో బయోటిక్స్ జాబితాకు చెందుతుంది. ఈ టీని రోజూ తాగుతున్నా కూడా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పైగా ఈ టీని సేవిస్తుంటే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. ఊరగాయలను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని స్వల్ప మోతాదులో తినాల్సి ఉంటుంది. మరీ అతిగా తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అరటి పండ్లలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. రోజూ ఒక అరటి పండును తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఓట్స్ను కూడా తినవచ్చు. యాపిల్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాకు కావల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
బీన్స్, పప్పు దినుసులు, శనగల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. అవిసె గింజలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. రోజూ గుప్పెడు మోతాదులో అవిసె గింజలను కాస్త వేయించి తినవచ్చు. సాయంత్రం సమయంలో స్నాక్స్ రూపంలో వీటిని తింటే మేలు జరుగుతుంది. మటన్ బోన్స్ సూప్ కూడా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇందులో కొల్లాజెన్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇక జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అత్యధిక చక్కెర కలిగిన ఆహారాలు, కృత్రిమ స్వీటెనర్లు, మద్యం, వేపుళ్లు, కొవ్వు కలిగిన ఆహారాలు, నూనె పదార్థాలను తినకూడదు. ఇవి జీర్ణ వ్యవస్థకు ఎంతో హాని చేస్తాయి. ఇలా ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటిస్తే జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.