Forgetfulness | వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే మెదడు పనితీరు మందగిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. ఏ విషయంపై కూడా దృష్టి సారించలేకపోతుంటారు. ముఖ్యంగా మతిమరుపు సమస్య వస్తుంది. ఇది తీవ్రతరం అయితే అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అయితే కొందరు యుక్త వయస్సులో ఉన్నప్పటికీ మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. మెదడు పనితీరు మందగించినట్లు అనిపిస్తుంది. దేనిపై కూడా ధ్యాస పెట్టలేకపోతుంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే ఎంతగానో మేలు జరుగుతుంది. మతిమరుపు అనేది పలు రకాల కారణాల వల్ల వస్తుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ల లోపం ఉంటే ఈ సమస్య ఎదురవుతుంది. అందుకు గాను కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే డోకోసాహెగ్జాఇనోయిక్ యాసిడ్ (డీహెచ్ఏ) కూడా ఉంటుంది. ఇవి మెదడు కణాలను నిర్మించేందుకు సహాయం చేస్తాయి. దీని వల్ల మెదడు, నాడీ మండల వ్యవస్థ కణాలు ఉత్తేజితం అవుతాయి. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతుంది. వారంలో కనీసం 2 సార్లు చేపలను తింటుంటే మతిమరుపు సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే మనకు అనేక రకాల బెర్రీ పండ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్బెర్రీలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, ఆంథో సయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి మెదడుపై పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో మెదడు కణాలు వాపులకు గురి కాకుండా ఉంటాయి. మెదడు కణాలు ఉత్తేజితం చెంది ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. మతిమరుపు తగ్గుతుంది.
ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలను మెదడుకు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. పాలకూర ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఇందులో విటమిన్ కె, లుటీన్, ఫోలేట్, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా పనిచేసేలా చేస్తాయి. మెదడు కణాలను నిర్మించేందుకు సహాయం చేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గిపోతుంది. అలాగే వాల్ నట్స్, బాదంపప్పు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలను రోజూ తింటున్నా కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది మెదడు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, మెగ్నిషియం, కాపర్, ఐరన్ వంటి పోషకాలు నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మతిమరుపు సమస్య తగ్గేలా చేస్తాయి.
రోజూ ఒక కోడిగుడ్డును తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని, ఎలాంటి రోగాలు రావని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజుకు ఒక గుడ్డును తింటే మెదడు సైతం ఆరోగ్యంగా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తుంది. కోడిగుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది అసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుడ్లలో ఉండే విటమిన్లు బి6, బి12, ఫోలేట్ వయస్సు మీద పడడం వల్ల మెదడు కణాలు క్షీణించే రేటును తగ్గిస్తాయి. దీంతో మెదడు ఎల్లప్పుడూ ఉత్తేజంగా ఉంటుంది. మతిమరుపు తగ్గిపోతుంది. అయితే కోడిగుడ్డులో ఉండే పచ్చని సొనను తింటేనే ఈ లాభాలు కలుగుతాయి. అలాగే పసుపు కూడా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపు కలిపిన పాలను తాగుతుంటే మెదడు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మెదడు కణాలు నిర్మాణమవుతాయి. దీంతో మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఇలా పలు ఆహారాలను తరచూ తీసుకుంటుంటే మతిమరుపు సమస్యను తగ్గించుకోవచ్చు.