Eye Sight | ఒకప్పుడు ప్రజలకు కేవలం వృద్ధాప్యం వస్తేనే కంటి చూపు మందగించేది. వయస్సు మీద పడితేనే కంటి సమస్యలు వచ్చేవి. అద్దాలను కూడా వృద్ధాప్యంలోనే ధరించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న వయస్సులో ఉన్నవారు కూడా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపు కూడా సరిగ్గా ఉండడం లేదు. దీంతో చిన్నారులు సైతం కళ్లద్ధాలను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు ప్రధాన కారణం ఆహారం అని చెప్పవచ్చు. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లనే ప్రస్తుతం చాలా మందికి కంటి చూపు మందగిస్తోంది. పోషకాహార లోపం వల్ల కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ సరైన ఆహారాన్ని వేళకు తీసుకుంటే కంటి చూపును సరి చేసుకోవచ్చని, దీంతో కళ్లద్దాలను వాడాల్సిన అవసరం ఉండదని నేత్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అని వారు చెబుతున్నారు.
కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు గాను పలు రకాల విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు సహాయం చేస్తాయి. విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల కళ్లలోని కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. కంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. క్యారెట్లు, ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం, బ్రోకలీ, పాలకూర, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు, నిమ్మజాతి పండ్లు, యాపిల్స్, టమాటా వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల ఆయా పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. దీంతో కంటి సమస్యలు రాకుండా కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే చేపలు, అవిసె గింజలు, బాదంపప్పు వంటి ఆహారాలను తింటుండాలి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. కళ్లను రక్షిస్తాయి.
ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలతోపాటు కోడిగుడ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ల కణాలను రక్షిస్తాయి. వృద్ధాప్యంలో కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూస్తాయి. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేస్తుంటే ఫలితం ఉంటుంది. రోజూ వాకింగ్ లేదా యోగా వంటివి చేస్తుంటే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎండలో ఎక్కువగా తిరిగే వారు కళ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలను ధరిస్తే మేలు జరుగుతుంది. దీని వల్ల కళ్లు సురక్షితంగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది. కంటి చూపు దెబ్బతినకుండా ఉంటుంది.
డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు ఉంటే సహజంగానే కంటి చూపు మందగించడం లేదా కళ్ల ఆరోగ్యం దెబ్బ తినడం జరుగుతుంది. కనుక ఆయా సమస్యలు ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వైద్యుల సూచన మేరకు మందులను వాడుకోవాలి. దీంతో కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే రోజూ గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు కచ్చితంగా మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. అందుకు గాను 20-20-20 అనే నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. ఈ నియమాన్ని పాటిస్తుంటే కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీని వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. అలాగే పొగ తాగడం, మద్యం సేవించడం మానేయాలి. వీటి వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ను ధరించే వారు వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఆయా ఆహారాలను తింటుంటూ ఆయా జాగ్రత్తలను పాటిస్తుంటే కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.