High Cholesterol | ప్రస్తుత తరుణంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోవడం కారణంగా గుండె జబ్బులు కూడా వస్తున్నాయి. చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటు బారిన పడి చనిపోతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయని తెలియడం లేదు. దీంతో ముప్పు ఏర్పడుతోంది. కనుక ప్రతి ఒక్కరు వయస్సుతో సంబంధం లేకుండా కనీసం ఏడాదికి ఒకసారి అయినా సరే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకుని కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉందీ లేనిదీ సులభంగా గుర్తించవచ్చని, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చని, దీంతో గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇక అందుకు ఏమేం ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఓట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది జెల్ లాంటి పదార్థం. కనుక ఓట్స్‌ను తిన్నప్పుడు ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌కు అతుక్కుపోతుంది. అనంతరం వ్యర్థం రూపంలో బయటకు వస్తుంది. కనుక ఓట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. ఓట్స్‌ను కొందరు రోజూ ఉదయం పాలతో కలిపి తింటారు. లేదా ఓట్మీల్, ఉప్మా లాగా ఓట్స్‌ను తయారు చేసి తినవచ్చు. ఓట్స్ లాగే బార్లీ గింజలు కూడా మేలు చేస్తాయి. వీటిల్లోనూ బీటా గ్లూకాన్ ఉంటుంది. ఇది కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బార్లీ గింజలను ఉడకబెట్టి తినవచ్చు. లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగవచ్చు. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే బాదంపప్పు, వాల్ నట్స్, అవిసె గింజలను తినడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక రోజూ వీటిని గుప్పెడు మోతాదులో నానబెట్టి తింటుంటే మేలు జరుగుతుంది.
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల రక్త నాళాలు, గుండె కండరాల వాపులు తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. తరచూ చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. శనగలు, పప్పు దినుసులు, కిడ్నీ బీన్స్ వంటి వాటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించుకోకుండా చూస్తాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ పప్పు దినుసులను రోజూ కూరల్లో వేసి తినవచ్చు. లేదా నేరుగా ఉడకబెట్టి తినవచ్చు.
అవకాడోలలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్ పండ్లు, బెర్రీలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లను తింటున్నా కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. బెండకాయలు, వంకాయలు వంటి కూరగాయలు కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. కనుక వీటిని కూడా తరచూ తినాలి. ఇలా పలు రకాల ఆహారాలను తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు.