Seeds | వేసవి కాలంలో శరీరం చెమట ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్‌తో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో నీళ్లు తాగడం అవసరమే అయినప్పటికీ, కొన్ని విత్తనాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా శరీరానికి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. నీటిలో నానబెట్టినప్పుడు చాలా విత్తనాలు జెల్లా మారుతాయి. దీంతో అవి సులభంగా జీర్ణమవడమే కాకుండా, వాటిలోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. విత్తనాల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు E, C, K, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవిలో నీటిలో నానబెట్టి తీసుకోదగిన, శరీరానికి మేలు చేసే కొన్ని విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో తీసుకోదగిన విత్తనాలల్లో చియా విత్తనాలు ఒకటి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జెల్లా మారి తేమను నిల్వచేసే గుణం కలిగి ఉంటాయి. ఫైబర్, ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో, ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. వీటిని స్మూతీలు, పెరుగు, ఓట్స్ లేదా నిమ్మరసం కలిపిన నీటిలో వేసి తీసుకోవచ్చు. అలాగే సబ్జా విత్తనాలు వేసవిలో ఎక్కువగా ఉపయోగించే సంప్రదాయ పానీయాల్లో కనిపిస్తాయి. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు పారదర్శక పొర ఏర్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ విత్తనాలు జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నిమ్మరసం, పాలు ఆధారిత పానీయాలు, ఫ్రూట్ స్మూతీల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
అదే విధంగా అవిసె గింజలను కూడా నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. అవిసె గింజలను నీటిలో నానబెట్టినప్పుడు మెత్తగా మారి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, ప్లాంట్ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గట్ (జీర్ణాశయ) ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పాయసం, పెరుగు లేదా స్మూతీలలో కలిపి వీటిని తీసుకోవచ్చు. మెంతులను సాధారణంగా రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటారు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. నానబెట్టడం వల్ల చేదు తగ్గి తినడానికి సులభమవుతుంది. మెటాబాలిజాన్ని మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఇక చిన్నగా ఉన్నప్పటికి నువ్వులు పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి మెత్తగా మారి జీర్ణానికి అనుకూలంగా మారుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. సలాడ్లు, స్మూతీలు లేదా అల్పాహారంలో వీటిని చేర్చుకోవచ్చు. ఇలా చియా, సబ్జా, అవిసె, మెంతులు, నువ్వులు వంటి విత్తనాలను నీటిలో నానబెట్టి వేసవిలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇవి హైడ్రేషన్, జీర్ణక్రియ, సమగ్ర ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు.అయితే ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యకరమైనవైనా, అధికంగా తీసుకుంటే సమస్యలు తలెత్తవచ్చు. తగినంత నీరు, సీజనల్ ఆహారంతో పాటు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో శరీరం ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.