Seeds | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. పౌష్టికాహారాలను తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని పోషకాలు లభించి పోషకాహార లోపం తగ్గుతుంది. అనేక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. అయితే పౌష్టికాహారాల విషయానికి వస్తే పలు రకాల విత్తనాలు వాటిల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. మనకు తినేందుకు అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. విత్తనాలను తినడం వల్ల అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు లభిస్తాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. పైగా శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది. కనుక విత్తనాలను మనం రోజూ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల విత్తనాల్లో అవిసె గింజలు కూడా ఒకటి. వీటిల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. రోజూ గుప్పెడు అవిసె గింజలను నీటిలో నానబెట్టి లేదా పెనంపై కాస్త వేయించి సాయంత్రం సమయంలో స్నాక్స్ లా తింటుండాలి. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. అవిసె గింజలను తింటుంటే బీపీని తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. అలాగే చియా సీడ్స్ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కూడా ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ లభిస్తాయి. చియా విత్తనాలను తింటుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు తగ్గుతాయి. శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
మనకు నువ్వులు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఫైబర్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు పుష్కలంగా ఉంటాయి. నువ్వులను తింటే క్యాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. మహిళల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారు నువ్వులను తింటుంటే కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పొద్దు తిరుగుడు విత్తనాలను కూడా రోజూ తినవచ్చు. రోజూ గుప్పెడు మోతాదులో వీటిని నానబెట్టి లేదా కాస్త వేయించి తినవచ్చు. సాయంత్రం స్నాక్స్ రూపంలో వీటిని తినాలి. ఈ విత్తనాలను తింటుంటే కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉంటాయి. గర్భిణీలకు మేలు చేస్తాయి.
రోజూ గుమ్మడికాయ విత్తనాలను తింటున్నా ఎంతో మేలు జరుగుతుంది. వీటిల్లో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాల్లో అధికంగా ఉండే మెగ్నిషియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి తగ్గుతుంది. ఈ విత్తనాల్లో జింక్ అధికంగా ఉంటుంది కనుక రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. వీటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల విత్తనాలను రోజూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిని అన్నింటినీ కలిపి రోజుకు ఒక గుప్పెడు మోతాదులో కూడా తినవచ్చు. నీటిలో నానబెట్టి తింటే తేలిగ్గా జీర్ణం అవడమే కాదు, పోషకాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఇలా ఆయా విత్తనాలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.