Rice | బియ్యం మన ఆహారంలో ముఖ్య భాగం. మనం ఎంతో కాలంగా తెల్ల బియ్యాన్ని ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. తెల్ల బియ్యాన్ని వండడం కూడా చాలా సులభం. అయితే తెల్లబియ్యంలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు తెల్లబియ్యాన్ని తీసుకోకూడదని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తులైనా సరే తెల్లబియ్యాన్ని అధికంగా తీసుకోకూడదని దీని వల్ల భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి అన్నం తినందే భోజనం చేసినట్టుగా ఉండదు. అలాంటి వారు తెల్లబియ్యానికి బదులుగా ఇతర రైస్ లను తీసుకోవచ్చు.
బ్రౌన్ రైస్, రెడ్ రైస్, వైల్డ్ రైస్, బ్లాక్ రైస్, బాస్మతి రైస్ వంటి వాటిని తెల్లబియ్యానికి ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ రైస్ లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్న వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటితో అన్నాన్ని వండి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలల్లో ఆకస్మికంగా వచ్చే హెచ్చుతగ్గులను నివారించవచ్చు. బ్రౌన్రైస్ తో అన్నాన్ని వండుకుని తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.
ఇక రెడ్రైస్ లో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రెడ్రైస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది కనుక రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ రైస్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వైల్డ్ రైస్ సాంకేతికంగా గడ్డి లాటింది కానీ దీనిలో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. వైల్డ్ రైస్ జీర్ణక్రియ నెమ్మదిగా అయ్యేలా చేస్తుంది. కనుక ఈ రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.
అదే విధంగా బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియ ఆరోగ్యానికి, పేగు ఆరోగ్యానికి బ్లాక్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. అదే విధంగా బాస్మతిరైస్ కూడా తెల్లబియ్యం కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. బాస్మతిబియ్యం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ తో బాధపడే వారు, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్న వారు తెల్లబియ్యానికి ప్రత్యామ్నాయంగా ఇతర రైస్ లను కూడా తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ రైస్ లను తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.