Calcium Foods | మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాంటే మనం క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. క్యాల్షియం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా మారుతాయి. అలాగే విటమిన్ డి కూడా ఎముకల ఆరోగ్యానికి దోహద పడుతుంది. మన శరీరం క్యాల్షియంను అధికంగా శోషించుకుని ఎముకలు బలంగా ఉండాలంటే అందుకు విటమిన్ డి కావాలి. క్యాల్షియం శోషణకు విటమిన్ డి పనిచేస్తుంది. ఎముకల సాంద్రత పెరిగేందుకు విటమిన్ కె కూడా అవసరమే. ఇలా ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను మనం తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెగ్నిషియం, ఫాస్ఫరస్ వంటి ఇతర మినరల్స్ వల్ల కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక వీటిన్నింటినీ మనకు లభించేలా చూసుకోవాలి.
క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో అంజీర్ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు డ్రై ఫ్రూట్స్ లాగా ఎక్కువ శాతం అందుబాటులో ఉంటాయి. రోజూ రాత్రి పూట 3 లేదా 4 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఈ పండ్లను తినాలి. అంజీర్ పండ్లను ఒక కప్పు తింటే మనకు సుమారుగా 121 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. ఈ పండ్లలో ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి కండరాల పనితీరును మెరుగు పరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నారింజ పండ్లను తింటున్నా కూడా క్యాల్షియం లభిస్తుంది. ఒక మీడియం సైజ్ నారింజ పండును తింటే సుమారుగా 74 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. నారింజ పండ్లలో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. అలాగే క్యాలరీలు కూడా తక్కువే కనుక ఈ పండ్లను తింటే బరువు కూడా తగ్గుతారు.
సముద్రపు చేపలను ఆహారంగా తీసుకుంటే క్యాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. 120 గ్రాముల చేపలను తింటే సుమారుగా 351 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. అలాగే చేపలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థకు అవసరం అయిన విటమిన్ బి12ను కూడా పొందవచ్చు. చేపలను తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాల్లో బెండకాయలు కూడా ఒకటి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బెండకాయలను ఒక కప్పు తినడం ద్వారా సుమారుగా 82 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. బెండకాయల్లో ఉండే విటమిన్ బి6, ఫోలేట్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. రోగాలు రాకుండా చూస్తాయి.
సోయా టోఫులోనూ క్యాల్షియం అధికంగానే ఉంటుంది. దీన్ని సగం కప్పు తింటే సుమారుగా 434 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం లభిస్తుంది. అలాగే బాదంపప్పును కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బాదంపప్పును 30 గ్రాముల మేర తింటే 75 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. బాదంపప్పును పొట్టు తీయకుండా తింటేనే మేలు జరుగుతుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, పొటాషియం కూడా అధికంగానే ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తింటే కేవలం ఎముకలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.