Tamarind | చింతపండును మనం తరచూ వంటల్లో వేస్తుంటాం. దీంతో చారు, పులుసు, రసం, పులిహోర వంటి వంటకాలను చేస్తుంటారు. పప్పులోనూ చింత పండు తప్పనిసరి. చింత పండు పడకపోతే కూరలకు లేదా వంటకాలకు రుచి రాదు. అయితే చింత పండు పులుపు కాబట్టి దీన్ని తినకూడదని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే చింతపండు ఎంత పులుపు అయినప్పటికీ దీన్ని మోతాదులో తింటే దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చింత పండు మనకు అనేక లాభాలను అందిస్తుందని వారు అంటున్నారు. చింత పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ ఇందులో అధిక మొత్తంలో లభిస్తాయి. పాలిఫినాల్స్, టార్టారిక్ యాసిడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
చింత పండు సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక చింతపండును తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. తీవ్రమైన మలబద్దకం ఉన్నవారు చింత పండును తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అయితే విరేచనాలు అవుతున్నవారు మాత్రం దీన్ని తినకూడదు. చింతపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. చింతపండులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ (హెచ్‌సీఏ) అధికంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. కనుక చింత పండును తింటే శరీరంలో కొవ్వు నిల్వ అవకుండా చూసుకోవచ్చు. దీని వల్ల బరువు తగ్గుతారు. చింతపండులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. చింతపండులో బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. చింతపండును ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. లివర్ ఆరోగ్యానికి కూడా చింత పండు ఎంతగానో మేలు చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం చింత పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
చింత పండును తినడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. చింత పండులో అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. అనేక రకాల వి విటమిన్లతోపాటు విటమిన్ సి, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్ని రోగాల నుంచి రక్షిస్తాయి. అయితే చింత పండు ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. అధికంగా తింటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. చింత పండును రోజుకు అర టీస్పూన్ మోతాదులో తినవచ్చు. అంతకు మించి తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ చింత పండును తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.