Star Anise | మనం మసాలా వంటకాలను చేసినప్పుడు అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తుంటాం. మసాలా వంటకాల్లో మసాలా పదార్థాలను విరివిగా వేస్తుంటాం. వాటిల్లో అనాస పువ్వు కూడా ఒకటి. దీన్నే స్టార్ అనిస్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. దీన్ని వేయడం వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. స్టార్ అనిస్‌ను చైనా, వియత్నాం తదితర దేశాలకు చెందిన వారు కూడా ఉపయోగిస్తుంటారు. దీన్ని వారు సంప్రదాయ వైద్య విధానంలో ఔషధంగా వాడుతారు. మన దేశ సంప్రదాయ వైద్య విధానం అయిన ఆయుర్వేద ప్రకారం కూడా అనాస పువ్వు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనల్ని పలు రోగాల నుంచి రక్షిస్తాయి. ఇన్ఫెక్షన్లు నయం అయ్యేలా చేస్తాయి.
అనాస పువ్వులో షికిమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఫ్లూ తగ్గేందుకు వాడే ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. అనాస పువ్వును ఫార్మా కంపెనీలు కూడా ఉపయోగిస్తున్నాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అనెథోల్ అనే ఫ్లేవనాయిడ్ ఈ పువ్వులో ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనాస పువ్వులో లినలూల్, క్వర్సెటిన్, గాలిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
అనాస పువ్వును జీర్ణ సమస్యలను తగ్గించే ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇందులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. భోజనం చేసిన తరువాత ఈ పువ్వును తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఈ పువ్వులో ఉండే అనెథోల్ అనే సమ్మేళనం పిండి పదార్థాల మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. షుగర్ ఉన్నవారికి అనాస పువ్వు ఎంతో మేలు చేస్తుందని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఇవి గుండె కణాలను ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా రక్షిస్తాయి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె పోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అనాస పువ్వును మీరు రోజూ చేసే వంటల్లో వేయవచ్చు. సూప్‌లు, చారు, ఇతర కూరల్లోనూ వేసి ఉపయోగించవచ్చు. గరం మసాలా పొడి తయారీలోనూ దీన్ని వాడుతారు. ఈ పువ్వు పొడిని నేరుగా ఆహారంపై చల్లి కూడా తినవచ్చు. సూప్‌లపై చల్లి తాగవచ్చు. స్టార్ అనిస్ పువ్వుతో టీ డికాషన్ తయారు చేసి తాగవచ్చు. అవసరం అనుకుంటే ఇందులో దాల్చిన చెక్క పొడి, అల్లం, యాలకులు వేసి మరిగించి తాగవచ్చు. ఈ పువ్వును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్వరం నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. అనాస పువ్వు మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందించే మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు. లేదంటే దుష్పరిణామాలు సంభవిస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకోకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ అనాస పువ్వును తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.