Sapodilla | వేసవి కాలంలో మనకు లభించే అనేక రకాల పండ్లలో సపోటా పండ్లు కూడా ఒకటి. వేసవి సీజన్ మొదలైందంటే మనకు సపోటాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మామిడి పండ్ల కన్నా ముందే ఈ పండ్లు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సపోటా చెట్లు ఎక్కువగా ఉష్ణ మండల ప్రదేశాల్లో పెరుగుతాయి. సపోటా చెట్టు ఏడాదికి రెండు సార్లు పంటను ఇస్తుంది. కానీ సంవత్సరం మొత్తం ఈ చెట్టు పూత పూస్తూనే ఉంటుంది. సపోటా పండ్లు ఇతర పండ్ల కన్నా భిన్నమైనవని చెప్పవచ్చు. ఇతర పండ్లు చెట్టు మీద పండుతాయి. కానీ సపోటా పండ్లు మాత్రం చెట్టు మీద నుంచి కోసిన తరువాతే పండుతాయి. అందుకనే పచ్చిగా ఉన్న సపోటాలను తెంపి పండిస్తారు. అనంతరం వాటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. అందుకని చాలా మంది ఈ పండ్లను తినేందుకు ఇష్టపడుతుంటారు.
సపోటా పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సపోటా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సుఖ విరేచన కారిగా పనిచేస్తుంది. కనుక మలబద్దకం ఉన్నవారు సపోటా పండ్లను తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. సపోటా పండ్లను తింటే పెద్ద పేగుల్లో ఉండే మ్యూకస్ పోతుంది. దీంతో మలం సులభంగా కదులుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఈ పండ్లలో పాలిఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
పపోటా పండ్లలో టానిన్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఈ పండ్లను తింటే త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. సపోటా పండ్లను తినడం వల్ల విటమిన్ కె లభిస్తుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు ఉపయోగపడుతుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఈ పండ్లను తింటే రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. విరేచనాలు అయిన వారు సపోటా పండ్లను తింటే త్వరగా ఆ సమస్య నుంచి కోలుకుంటారు.
కాళ్ల నొప్పులు, మంటలు ఉన్నవారు సపోటా పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. గ్యాస్, అన్నవాహిక నొప్పి, పేగుల్లో నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గించే శక్తి సపోటా పండ్లకు ఉంది. పేగుల్లో ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. సపోటా పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఒక మీడియం సైజ్ సపోటా పండును తింటే మనకు రోజులో కావల్సిన విటమిన్ సిలో 24 శాతం వరకు లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సపోటాలను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. బాగా పండిన సపోటాలలో పొటాషియం, రాగి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి. రక్తం తయారయ్యేలా చేస్తాయి. ఇలా సపోటా పండ్లను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.