Sabja Seeds | వేసవి కాలంలో మనం సహజంగానే చల్లని మార్గాల వైపు పరుగులు పెడుతుంటాం. ఎండలో తిరుగుతుంటే లస్సీ, ఫలాదా వంటివి తాగుతాం. అయితే వీటిల్లో వేసే చిన్నపాటి గింజలను మీరు గమనించే ఉంటారు. వాటినే సబ్జా గింజలు అంటారు. ఇలాంటి చల్లని పానీయాల్లో ఈ గింజలను ఎక్కువగా వేస్తుంటారు. ఎందుకంటే ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను ఎక్కువగా పానీయాలు లేదా తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటారు. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయం చేస్తాయి.
సబ్జా గింజలను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని నీటిలో సుమారు 4 గంటలపాటు నానబెట్టాలి. తరువాత వాటిని నేరుగా తినవచ్చు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. మీరు తినే పండ్ల ముక్కలపై చల్లి కూడా తినవచ్చు. నబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. సబ్జా గింజలను నానబెట్టి జ్యూస్లలో కలిపి కూడా తాగవచ్చు. అంత సమయం లేదనుకుంటే నీటిలో 10 నిమిషాలు అయినా నానబెట్టాలి. తరువాత ఆ నీళ్లను సేవించాలి. ఇలా చేస్తే ఆకలి త్వరగా నియంత్రణలోకి వస్తుంది. జంక్ ఫుడ్ తినకుండా ఉంటారు. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
సబ్జా గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. ఈ గింజల్లో అల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. సబ్జా గింజలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఈ గింజలు రక్షిస్తాయి. ఈ గింజలను ఆహారంగా తింటే వినికిడి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. చెవుల్లో ఉండే నొప్పి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.
వేసవిలో సబ్జా గింజలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీరం చల్లగా ఉండేలా చేస్తాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఈ గింజలను తినడం వల్ల చెమటకాయల సమస్య సైతం తగ్గుతుంది. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి కాస్త చక్కెర కలిపి తినవచ్చు. లేదా కొబ్బరి నీటిలోనూ కలిపి తాగవచ్చు. పైనాపిల్, యాపిల్, ద్రాక్ష వంటి పండ్ల రసాల్లోనూ ఈ గింజలను వేసి కలిపి తాగవచ్చు. దీంతో వడదెబ్బ రాకుండా రక్షిస్తాయి. ఈ గింజలను ధనియాల రసంతో సేవిస్తే జ్వరం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ సబ్జా గింజలను తింటుంటే ఫలితం ఉంటుంది. ఇలా ఈ గింజలతో మనం అనేక లాభాలను పొందవచ్చు.