Red Rice | భారతీయుల ఆహారంలో బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. బియ్యంతో అన్నాన్ని వండుకుని వివిధ కూరలతో తింటూ ఉంటాం. సాధారణంగా మనం రోజూ వండుకునే బియ్యమే కాకుండా బియ్యంలో కూడా వివిధ రకాలు ఉంటాయి. వాటిలో ఎర్రబియ్యం కూడా ఒకటి. వీటిని రెడ్ రైస్ అని కూడా అంటారు. ఈ బియ్యం కొద్దిగా పొడవుగా, గుండ్రంగా ఉంటాయి. ఇవి నీటిలో కరిగే వర్ణద్రవ్యం ఆంథోసైనిన్ తో పాటు ఎరుపు రంగును కలిగి ఉంటాయి. ఈ బియ్యం సాధారణ బియ్యం కంటే కొద్దిగా వగరు రుచిని కలిగి ఉంటాయి. అయినప్పటికి వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. రెడ్ రైస్ ను ఎక్కువగా ఆసియా దేశాల్లో పండిస్తారు. ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక, ఇండోనేషియాలలో దీనిని అధికంగా సాగు చేస్తారు. సాధారణంగా ఈ బియ్యం వాటిపై ఉండే పొట్టు నుండి ఎరుపు రంగును పొందుతాయి. రెడ్ రైస్ లో కూడా అనేక పోషకాలు ఉంటాయి కనుక ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రెడ్ రైస్ ను కూడా మన ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ రైస్ ను మన ఆహారంలో అసలు ఎందుకు చేర్చుకోవాలి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను వారు తెలియజేస్తున్నారు. రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. రెడ్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉంటాయి. శరీర బరువును అదుపులో ఉంచడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.
రెడ్ రైస్ లో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు అనేకం ఉన్నాయి. ఈ బియ్యంలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరిచే న్యూరోట్రాన్సిటర్లను ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ రైస్ లో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఎర్రబియ్యంలో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో , జీవక్రియలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. రెడ్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. సెలియాక్ వ్యాధి, గ్లూటెన్ అలర్జీ, వీట్ ఎలర్జీ ఉన్న వారికి ఇవి ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. గ్లూటెన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల కొందరిలో కడుపు నొప్పి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి రెడ్ రైస్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.
రెడ్ రైస్ ను నేరుగా తీసుకోవడంతో పాటు ఇతర రకాల వంటకాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. దీనిని సలాడ్, సూప్ లతో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా రైస్ పుడ్డింగ్, రైస్ ఫ్లోర్ టోర్టిల్లాలు వంటి వంటకాల్లో సాధారణ బియ్యానికి బదులుగా ఈ రెడ్ రైస్ ను ఉపయోగించవచ్చు. దీంతో ఆయా వంటకాల రుచితో పాటు పోషకాల విలువ కూడా పెరుగుతుంది. పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలను తగ్గించడంలో రెడ్ రైస్ మనకు సహాయపడుతుంది. ఈ బియ్యంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ సమ్మేళనాలే ఇందుకు కారణం. ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను వాటి వ్యాప్తిని నిరోధించి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇలా అనేక రకాలుగా ఎర్రబియ్యం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన మొత్తం శరీరానికి మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.