Raw Onions | భారతీయుల వంటగదుల్లో సర్వసాధారణంగా కనిపించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఇది దాదాపు అందరి వంటగదుల్లో ఉంటుందని చెప్పవచ్చు. వంటల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. పకోడి, సలాడ్స్, సాండ్విచ్ వంటి వాటిల్లో కూడా ఉల్లిపాయను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే చాలా మంది దీనిని భోజనంతో పాటు వివిధ రకాల చిరుతిండ్లతో నేరుగా తీసుకుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చి ఉల్లిపాయలను నేరుగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పచ్చిఉల్లిపాయలల్లో ఉండే పోషకాలు, వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో వాపులను, అలర్జీ లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఉల్లిపాయల విటమిన్ సి, బి విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక చక్కెర వ్యాధితో బాధపడే వారికి కూడా ఉల్లిపాయలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ తో బాధపడే వారు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
ఉల్లిపాయలల్లో ప్రీబయోటిక్స్ తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా ఉల్లిపాయ సహాయపడుతుంది. ఉల్లిపాయలల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి తోడ్పడతాయి. ఎముకలను ధృడంగా చేయడంలో కూడా ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. వయసు పైబడిన వారు వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. దీంతో వారిలో ఎముకలు విరగడం వంటి సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీర బరువు అదుపులో ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని భోజనంతో పాటు పచ్చిగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.