Pumpkin Seeds | ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలను తింటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మనకు వివిధ రకాల పౌష్టికాహారాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇక అలాంటి వాటిల్లో గుమ్మడికాయ విత్తనాలు కూడా ఒకటి. అయితే వీటిని రోజూ ఎలా తినాలి, ఎన్ని తినాలి, ఏ సమయంలో తినాలి.. అని చాలా మంది సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడికాయ విత్తనాలను నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. కనీసం 6 నుంచి 8 గంటలపాటు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టి తరువాత తినాలి. వీటిని రోజుకు ఒక గుప్పెడు మోతాదులో లేదా 30 గ్రాముల వరకు తినవచ్చు. వీటిని ఉదయం లేదా సాయంత్రం తినాల్సి ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడికాయ విత్తనాల్లో మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నిషియం, జింక్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. 30 గ్రాముల గుమ్మడికాయ విత్తనాలను తింటే సుమారుగా 150 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందువల్ల వీటిని ఉదయం తింటే రోజంతా శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్తేజంగా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. మెదడు సైతం యాక్టివ్ గా పనిచేస్తుంది. నీరసం, అలసట ఉండవు. బద్దకం పోతుంది. శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ విత్తనాలను తింటే ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయితే గుమ్మడికాయ విత్తనాలను మోతాదులోనే తినాలి. అధికంగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వచ్చే అవకాశాలు ఉంటాయి.
గుమ్మడికాయ విత్తనాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో 300కు పైగా జీవక్రియలను నిర్వహించేందుకు సహాయం చేస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కండరాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలను గట్టి పరుస్తుంది. శరీరంలో శక్తి ఉత్పత్తి అయ్యేందుకు సహాయం చేస్తుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బీపీని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతో హృదయ సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. వీటిల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ ఎల్లప్పుడూ తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాల్లో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం సహజసిద్ధంగా లభిస్తుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల మన శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. గుమ్మడికాయ విత్తనాలు పురుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే వీటిల్లో ఉండే జింక్ ప్రోస్టేట్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు మూత్రాశయ సమస్యలు కూడా రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా గుమ్మడికాయ విత్తనాలను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.