Onions | మనం రోజూ అనేక రకాల వంటలు చేస్తుంటాం. అనేక కూరలను రుచి చూస్తుంటాం. అయితే ఏ కూర అయినా సరే కచ్చితంగా ఉల్లిపాయ పడాల్సిందే. ఉల్లిపాయ లేకుండా ఏ వంటకమూ పూర్తి కాదు. ఉల్లిపాయను కొందరు మజ్జిగలో లేదా పెరుగులో పచ్చిగానే తింటుంటారు. అయితే వాస్తవానికి ఉల్లిపాయను రోజూ నేరుగా తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదంలో పలు ఔషధాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. ఉల్లిపాయను రోజూ 50 గ్రాముల మోతాదులో అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉల్లిపాయను తింటే పలు వ్యాధులను నయం చేసుకోవడంతోపాటు పోషకాలను కూడా పొందవచ్చని అంటున్నారు. ఉల్లిపాయను పెరుగు లేదా మజ్జిగలో అన్నంతోపాటు తినవచ్చు. లేదా కూరల్లోనూ కలిపి తినవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలను తింటే మేలు జరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. శరీరం ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో చర్మ కణాల డ్యామేజ్ అవకుండా సురక్షితంగా ఉంటాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. మృదువుగా ఉంటుంది. ఉల్లిపాయల్లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఉల్లిపాయలను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువ తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
ఉల్లిపాయల్లో సల్ఫర్, క్వర్సెటిన్ అని పిలవబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. దీంతో వృద్ధాప్యంలోనూ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు బీపీ, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. మలబద్దకం ఉన్నవారు ఉల్లిపాయలను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. సుఖ విరేచనం అవుతుంది. ఉల్లిపాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా చెప్పబడుతున్నాయి. అందుకని ఉల్లిపాయలను తింటే జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ఉల్లిపాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.