Oats | ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తింటున్నారు. వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో ఎన్ని వ్యాయామాలు చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా కొందరు సడెన్ గా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. కనుక గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అందుకు తగిన ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యాన్ని రక్షించే ఆహారాలు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఓట్స్ చాలా ప్రధానమైనవని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఓట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చని, ముఖ్యంగా గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఓట్స్‌ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఉప్మాలా తయారు చేసి తినవచ్చు. లేదా పాలు కలిపి తినవచ్చు. ఓట్స్ ఎంతో రుచిగా ఉంటాయి. ఓట్స్తోపాటు పండ్లను కూడా కలిపి తినవచ్చు. 100 గ్రాముల ఓట్స్‌ను తింటే సుమారుగా 390 క్యాలరీల శక్తి లభిస్తుంది. పిండి పదార్థాలు 68 గ్రాములు, ఫైబర్ 11 గ్రాములు, ప్రోటీన్లు 17 గ్రాములు, కొవ్వులు 7 గ్రాములు లభిస్తాయి. ఓట్స్‌లో అనేక రకాల బి విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి1, బి3, బి5, బి6, బి9లతోపాటు విటమిన్ ఇ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. కనుక ఓట్స్‌ను తింటే పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. శరీరానికి పోషణ లభిస్తుంది. ఓట్స్‌లో మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, ఐరన్, జింక్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకు రోగాలు రాకుండా చూస్తాయి. శరీర మెటబాలిజం ప్రక్రియను మెరుగు పరుస్తాయి. జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేలా సహాయం చేస్తాయి.
ఓట్స్‌ను తినడం వల్ల వాటిల్లో ఉండే బీటా గ్లూకాన్ అనే సాల్యుబుల్ ఫైబర్ మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌కు అతుక్కుని దాన్ని బయటకు పంపిస్తుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఓట్స్ ఎంతగానో సహాయం చేస్తాయి. ఓట్స్‌ను తినడం వల్ల క్యాలరీలు అధికంగా లభిస్తాయి. కానీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కారణం వీటిల్లో ఉండే ఫైబర్ అని చెప్పవచ్చు. ఓట్స్‌ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అందువల్ల ఓట్స్‌ను తింటే షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా ఓట్స్ మేలు చేస్తాయి. ఇవి ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారు ఓట్స్‌ను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాటిల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు ఓట్స్‌ను తింటుంటే ప్రయోజనం ఉంటుంది. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. ఇలా ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.