Mustard Seeds | మన వంట ఇంటి పోపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలను మనం రోజూ అనేక కూరలు లేదా వంటల్లో వేస్తుంటాం. అయితే కేవలం పోపు దినుసుగానే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ ఆవాలు మేటి అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎంతో కాలం నుంచి వీటిని వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. ఆవాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఆవాలు మనకు పలు రకాల రంగుల్లో లభిస్తాయి. పసుపు, గోధుమ, నలుపు రంగులో ఉండే ఆవాలు లభిస్తాయి. అయితే మనం నలుపు రంగులో ఉండే ఆవాలను ఉపయోగిస్తాం. ఆవాలలో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆవాలను కాస్త వేయించి పొడి చేసి దాన్ని పావు టీస్పూన్ మోతాదులో రోజూ అన్నంలో మొదటి ముద్దగా కలిపి తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
ఆవాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. ఆవాలలో సెలీనియం, మెగ్నిషియం, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆవాలలో విటమిన్లు సి, కె, పలు రకాల బి విటమిన్లు కూడా అధికంగానే ఉంటాయి. ఆవాలలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆవాలలో అధికంగానే ఉంటాయి. ఆవాలలో గ్లూకోసైనోలేట్స్, ఐసోథయోసయనేట్స్, సినిగ్రిన్, ఐసోర్హమ్నెటిన్, కాంప్ఫెరాల్, కెరోటినాయిడ్స్ అని పిలవబడే పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలను ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. దీంతో వాపులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. నొప్పులు, వాపుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
ఆవాలలో ఉండే గ్లూకోసైనోలేట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెద్దపేగు, బ్లాడర్, లంగ్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. ఆవాలలో ఉండే ఫైబర్ పేగుల్లో మలం కదలికలను సులభతరం చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ క్లీన్ అవుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త నాళాల పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఆవాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్‌ను శరీరం సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఆవాలకు వేడి చేసే గుణం ఉంటుంది. అందువల్ల వీటి పొడిని తింటే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో సహజంగానే చాలా మంది మామిడికాయలతో ఆవకాయ పచ్చడి పెడతారు. అందులో ఆవ పిండిని వాడుతారు. ఇది ఈ సీజన్లో మనకు మేలు చేస్తుంది. కానీ మోతాదులోనే తినాలి. ఆవాల పొడి వేసి రసం తయారు చేసి కూడా తాగవచ్చు. ఆవనూనెను కూడా మనం ఉపయోగించవచ్చు. ఇది కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.