Jaggery Tea | బెల్లాన్ని మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీంతో తియ్యని వంటకాలను ఎక్కువగా చేస్తుంటారు. బెల్లం ఎంతో రుచిగా ఉంటుంది. కనుక దీన్ని చాలా మంది నేరుగా అలాగే తింటుంటారు కూడా. చక్కెరతో చేసిన వంటకాలను చాలా మంది తినలేరు. అలాంటి వారు బెల్లం వంటకాలను ఎంచుకుంటారు. అయితే బెల్లంతో మనం టీ కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణ చక్కెరకు బదులుగా బెల్లం వాడితే అది బెల్లం టీ అవుతుంది. లేదా టీ డికాషన్, పాలు కలపకుండా బెల్లాన్ని కాస్త తీసుకుని నీటిలో వేసి మరిగించి అందులో కాస్త నిమ్మరసం కలిపి కూడా తాగుతారు. ఇలా కూడా బెల్లం టీని సేవిస్తుంటారు. అయితే బెల్లం టీని సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
బెల్లం టీని సేవిస్తే అందులో ఉండే సమ్మేళనాలు మన జీర్ణాశయంలో పలు ఎంజైమ్లను ఉత్తేజితం చేస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి ఉండదు. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగు పడుతుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. బెల్లంలో అధికంగా ఉండే మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. బెల్లం టీని తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
బెల్లంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని కూడా అంతర్గతంగా శుభ్రం చేస్తుంది. కనుక బెల్లం టీని సేవిస్తే శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. శ్వాసకోశ వ్యవస్థ సైతం శుభ్రపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్లోని కొవ్వు కరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. బెల్లం టీని తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికమవుతాయి. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి బెల్లం టీ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తాగుతుంటే ఎంత పనిచేసినా అసలు నీరసం రాదు. చురుగ్గా ఉంటారు.
బెల్లం టీని సేవిస్తుంటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. చల్లని వాతావరణంలో ఈ టీని తాగితే ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల చలి ప్రభావం తగ్గుతుంది. అయితే సాధారణంగా మనం వాడే చక్కెర కన్నా బెల్లం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలని చూస్తున్నవారు డాక్టర్ సలహా మేరకు బెల్లం టీని తాగితే మంచిది.