తులసి మొక్క దాదాపుగా అందరు ఇళ్లలోనూ ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. తులసి ఆకులతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. మనకు కలిగే పలు వ్యాధులను నయం చేయడంలో తులసి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. తులసి ఆకులను ఆరోగ్య నిపుణులు దివ్యౌషధంగా చెబుతుంటారు. అనేక రుగ్మతలను నయం చేయగల శక్తివంతమైన ఔషధ గుణాలు తులసిలో ఉంటాయి. ఈ క్రమంలోనే రోజూ పరగడుపునే నాలుగైదు తులసి ఆకులను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మనకు కలిగే వ్యాధులను నయం చేయడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుందని, దీంతో అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు.
తులసి ఆకులను రోజూ తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మార్చి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తులసి ఆకులను ఉదయం పరగడుపున తింటే శరీరం తనను తాను రక్షించుకోవడానికి కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరంలో చేరే బ్యాక్టీరియా, వైరస్లు వెంటనే నిర్మూలించబడతాయి. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల్లో సహజసిద్ధమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను తింటే శరీరంతోపాటు లివర్ కూడా శుభ్రంగా మారుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. శరీరానికి శక్తి లభించి యాక్టివ్‌గా ఉంటారు.
తులసి ఆకుల్లో అడాప్టొజెనిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. తులసి ఆకులను పరగడుపునే తింటే శరీరంలో కార్టిసాల్ లెవల్స్ తగ్గుతాయి. ఇది ఒత్తిడిని పెంచే హార్మోన్. కనుక తులసి ఆకులను తింటే ఈ హార్మోన్ ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజంతా మైండ్ ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటుంది. పనిపై ధ్యాస పెట్టగలుగుతారు. తులసి ఆకులను తినడం వల్ల జీర్ణాశయంలో ఎంజైమ్‌లు యాక్టివేట్ అవుతాయి. దీని వల్ల ఆహారం జీర్ణాశయంలో సులభంగా కదులుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
తులసి ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గు, ఆస్తమా, సైనస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. శ్వాసనాళాల్లో ఉండే వాపులను తగ్గిస్తాయి. దీంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసి ఆకులను తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. శరీరం ఇన్సులిన్న సమర్థవంతంగా గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి తులసి ఆకులు వరమనే చెప్పవచ్చు. రోజూ ఈ ఆకులను తింటుంటే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. తులసి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులను తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. బీపీ తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా రోజూ పరగడుపునే తులసి ఆకులను తింటే అనేక లాభాలను పొందవచ్చు.