Green Gram | సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది ఏ చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలను సాయంత్రం స్నాక్స్ గా తింటుంటారు. అలాగే బేకరీ ఆహారాలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఫాస్ట్ ఫుడ్, తీపి పదార్థాలను కూడా లాగించేస్తుంటారు. అయితే సాయంత్రం సమయంలో మనం తినే స్నాక్స్ ఆరోగ్యాన్నిచ్చేవి అయి ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సగం మనకు అనారోగ్య సమస్యలు వచ్చేందుకు సాయంత్రం సమయంలో తినే చిరుతిళ్లే కారణమని వారు అంటున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలని వారు సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యకరమైన స్నాక్స్ విషయానికి వస్తే పెసలు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. వీటిని ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం ఉడికించి పోపు వేసి తింటుండాలి. దీంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని వారు అంటున్నారు.
పెసలలో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మాంసాహారం తినని వారికి పెసలు ప్రోటీన్లను అందిస్తాయి. వీటి వల్ల శరీరం యాక్టివ్‌గా మారుతుంది. ఉత్సాహంగా ఉంటారు. రోజంతా పనిచేసి అలసిపోయిన వారు తిరిగి శక్తిని పొందుతారు. మళ్లీ పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి. పెసలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో పెసలను తింటే రాత్రి పూట పెద్దగా భోజనం చేయరు. తినే ఆహారం తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరదు. ఫలితంగా బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రోజూ పెసలను తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పెసల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల పెసలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు. పైగా పెసలలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు పెసలను రోజూ తింటే షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. పెసలను తింటే గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. పెసలలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి పెసలు ఎంతో మేలు చేస్తాయి. బీపీని కంట్రోల్లో ఉండేలా చేస్తాయి.
పెసలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు, విటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఇలా పెసలను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక సాయంత్రం సమయంలో నూనె, చక్కెరతో చేసిన చిరుతిండ్లను తినేబదులుగా పెసలను తింటే ఎన్నో విధాలుగా లాభాలు కలుగుతాయి.