Green Capsicum | క్యాప్సికం.. చాలా మంది దీన్ని మసాలా వంటల తయారీలో ఉపయోగిస్తారు. బిర్యానీ వంటివి వండినా కూడా క్యాప్సికం వేస్తారు. పేరుకు మిర్చి జాతికి చెందినదే అయినప్పటికీ క్యాప్సికం కారంగా ఉండదు. అందువల్ల దీన్ని కూరల్లో వేస్తే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇక క్యాప్సికంతో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు, పోషకాలను కూడా అందిస్తుంది. క్యాప్సికమ్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు రకానికి చెందిన క్యాప్సికం మనకు ఎక్కువగా లభిస్తుంది. అయితే ఎరుపు, పసుపు రంగు రకాలకు చెందిన క్యాప్సికం ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది ఆకుపచ్చ రంగు క్యాప్సికంనే వంటల్లో ఉపయోగిస్తారు. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా వంటల్లో వేసి కూడా తినవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. శరీరం ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దీంతో దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు తగ్గిపోతాయి. కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా విటమిన్ సి సహాయం చేస్తుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సాగే గుణాన్ని పొందుతుంది. కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే శిరోజాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. క్యాప్సికంలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు, కెరోటినాయిడ్స్ శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. రోగాలు రాకుండా సురక్షితంగా ఉంటారు.
ఆకుపచ్చ రంగు క్యాప్సికంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో మలం కదలికలను సరిచేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఆకుపచ్చ క్యాప్సికంలో కెరోటినాయిడ్స్, లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కంటి రెటీనాను రక్షిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. లైట్ల నుంచి వచ్చే నీలి రంగు కిరణాల బారి నుంచి కళ్లకు రక్షణ లభిస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
క్యాప్సికంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు ఉండదు. నీరు, ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక క్యాప్సికంను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధికంగా బరువు ఉన్నవారు రోజువారి ఆహారంలో క్యాప్సికంను తింటుంటే ఫలితం ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. అలాగే ఫైటో కెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ క్యాప్సికంను తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. వాపులు, నొప్పుల నుంచి బయట పడవచ్చు. ఇలా క్యాప్సికంను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. దీన్ని ఉడకబెట్టి లేదా నేరుగా సలాడ్ రూపంలోనూ తినవచ్చు.