Dry Grapes | రోజూ ఉదయం చాలా మంది బ్రేక్ ఫాస్ట్లో భాగంగా ఇడ్లీ, పూరీ, దోశ వంటి వాటిని తింటుంటారు. అయితే ఆరోగ్యవంతులు ఈ ఆహారాలను తింటే ఏమీ కాదు, కానీ రోగాలతో బాధపడుతున్నవారు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. పోషకాహార లోపం ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు ఉదయం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోగాల నుంచి త్వరగా బయట పడేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే కిస్మిస్లు కూడా ఆ జాబితాలో ఉంటాయని చెప్పవచ్చు. చాలా మంది వీటిని స్వీట్ల తయారీలో వేస్తుంటారు. కానీ ఎండు ద్రాక్షలను రోజూ తినాలి. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి. అనేక రోగాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్లో కిస్మిస్లను తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టాలి. వాటిని మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్లో భాగంగా తినాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎండు ద్రాక్షలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్షలను నానబెట్టి తింటే సులభంగా జీర్ణం అవుతాయి. దీంతో జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల క్యాల్షియం, మెగ్నిషియం, బోరాన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎండు ద్రాక్షలను తింటే క్యాల్షియం, బోరాన్ లభించి వృద్ధాప్యంలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఎండు ద్రాక్షలను తినడం వల్ల బీపీ తగ్గుతుంది. వీటిల్లో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. ఎండు ద్రాక్షలను తినడం వల్ల వాపులు సైతం తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. కిస్మిస్లను ఉదయం తింటే శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా యాక్టివ్గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరసం, అలసట ఉన్నవారు కిస్మిస్లను తింటే ఫలితం ఉంటుంది.
కిస్మిస్లను తినడం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎర్ర రక్త కణాలు తయారయ్యేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఎండు ద్రాక్షలను తింటే ఫైటో కెమికల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. కిస్మిస్లను తినడం వల్ల విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతంది. సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇలా ఎండు ద్రాక్షలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే విరేచనాల సమస్య ఉన్నవారు కిస్మిస్లను తినకూడదు.