Fruit Salad | ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగాలంటే పండ్లను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది తమకు ఇష్టమైన లేదా అందుబాటులో ఉన్న పండ్లను తింటుంటారు. అయితే ఒకే రకానికి చెందిన పండ్లను ఎక్కువ మోతాదులో తినడం కన్నా అన్ని రకాల పండ్లను కొద్ది మోతాదులో తినడం ఎంతో మేలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్ని రకాల పండ్లను కొద్ది మోతాదులో రోజూ తింటుంటే ఒకేసారి అధిక మొత్తంలో వివిధ రకాల పోషకాలను పొందవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని రకాల పండ్లను ఒకేసారి తినడం అంటే దాన్నే ఫ్రూట్ సలాడ్ అని కూడా అంటారు. అయితే ఫ్రూట్ సలాడ్ అంటే కేవలం పండ్లను మాత్రమే చిన్న ముక్కలుగా చేసి అన్నింటినీ కలిపి తినాలి. అందులో ఎలాంటి బేకరీ పదార్థాలను కలపకూడదు. ఇక ఫ్రూట్ సలాడ్‌ను రోజూ ఒక కప్పు తింటే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఫ్రూట్ సలాడ్‌లో భిన్న రకాల పండ్లు ఉంటాయి కనక మనకు దాదాపుగా అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఫ్రూట్ సలాడ్‌లో సిట్రస్ ఫలాలు, స్ట్రాబెర్రీలు, కివీలు, నారింజ, బొప్పాయి వంటి పండ్లను కలుపుతారు. కనుక మనకు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం శోషించుకునేలా చేస్తాయి. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చిన్నారులు, మహిళలు పండ్లను ఫ్రూట్ సలాడ్‌గా చేసి తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఫ్రూట్ సలాడ్‌లో మామిడి పండ్లు, తర్బూజా వంటి పండ్లను కూడా కలుపుతారు. వీటిల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఫ్రూట్ సలాడ్‌ను తింటే ఆ బీటాకెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
ఫ్రూట్ సలాడ్‌లో అరటి పండ్లు, నారింజ, తర్బూజా ఉంటాయి కనుక ఫ్రూట్ సలాడ్‌ను తింటే అధిక మొత్తంలో పొటాషియం లభిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఫ్రూట్ సలాడ్‌లో ఉండే వివిధ రకాల పండ్ల కారణంగా అధిక మొత్తంలో మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. గుండె పోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఫ్రూట్ సలాడ్‌లో ఉండే పండ్లలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. అన్ని రకాల పండ్లు ఉంటాయి కనుక వాటిల్లో ఉండే ఫైబర్ మొత్తం కలిపి ఎక్కువ శాతం ఫైబర్ మనకు లభిస్తుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఫైబర్ ఉన్న కారణంగా ఫ్రూట్ సలాడ్‌ను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఫ్రూట్ సలాడ్‌ను ఉదయం తింటే రోజంతా శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఇలా ఫ్రూట్ సలాడ్‌ను రోజూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.