Brazil Nuts | నట్స్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాదంపప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు. వీటినే చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలకు మీరు మొదటి ప్రాధాన్యతను ఇచ్చే వారు అయితే మీ డైట్లో కచ్చితంగా బ్రెజిల్ నట్స్‌ను చేర్చుకోవాల్సిందేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇతర నట్స్ మాదిరిగానే బ్రెజిల్ నట్స్‌లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందువల్ల బ్రెజిల్ నట్స్‌ను కచ్చితంగా రోజూ తినాలని చెబుతున్నారు. బ్రెజిల్ నట్స్‌ను పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ నట్స్ లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. కొవ్వును కరిగించేందుకు సహాయ పడుతుంది. కండరాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
బ్రెజిల్ నట్స్‌లో విటమిన్ ఇ కూడా అధికంగానే ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ నట్స్‌లో ఉండే విటమిన్ బి6, సెలీనియం కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఈ గింజల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం కింద ఉండే కొవ్వును తొలగించడంలో సహాయం చేస్తాయి. ఈ నట్స్ లో అధికంగా ఉండే జింక్ శరీరం వాపులకు గురి కాకుండా చూస్తుంది. దీంతోపాటు నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. బ్రెజిల్ నట్స్‌ను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.
బ్రెజిల్ నట్స్ ఎక్కువగా అమెజాన్ అడవుల్లో లభిస్తాయి. Bertholletia excelsa అనే చెట్టుకు ఈ నట్స్ పండుతాయి. ఈ చెట్టు ఒక్కొక్కటి సుమారుగా 50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బ్రెజిల్లో ఎక్కువగా ఈ చెట్లు పెరుగుతాయి. కనుక ఈ చెట్లకు లభించే నట్స్‌కు అదే పేరు వచ్చింది. బ్రెజిల్‌తోపాటు బొలివియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనెజులా వంటి దేశాల్లోనూ ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఒక్కో బ్రెజిల్ నట్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కో నట్ చిన్నపాటి ఖర్జూరం సైజులో ఉంటుంది. కనుక రోజుకు 3 నుంచి 5 బ్రెజిల్ నట్స్‌ను తిన్నా చాలు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఒక బ్రెజిల్ నట్ను తింటే 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. 1 గ్రాము కార్బొహైడ్రేట్లు, 1 గ్రాము ప్రోటీన్లు, 3 గ్రాముల కొవ్వులు, 1 గ్రాము శాచురేటెడ్ ఫ్యాట్, 19 మిల్లీగ్రాముల మెగ్నిషియం, 33 మిల్లీగ్రాముల పొటాషియం, 96 మైక్రో గ్రాముల సెలీనియం, 0.3 మిల్లీగ్రాముల విటమిన్ ఇ లభిస్తాయి.
బ్రెజిల్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే శరీర మెటబాలిజం పెరిగి కొవ్వు కరుగుతుంది. కండరాలు అభివృద్ధి చెందుతాయి. బ్రెజిల్ నట్స్‌ను తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగవుతుంది. మెటబాలిజం సక్రమంగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవారికి ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. లివర్ వ్యాధులు ఉన్నవారు ఈ నట్స్‌ను తింటుంటే త్వరగా కోలుకుంటారు. ఈ నట్స్‌లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని తింటే చర్మం, శిరోజాల సమస్యలు తగ్గుతాయి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే మెగ్నిషియం సమృద్ధిగా లభించి నిద్ర చక్కగా పడుతుంది. అలాగే రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా చూసుకోవచ్చు. ఇలా బ్రెజిల్ నట్స్‌ను రోజూ తింటే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.