Sesame Seeds | పిండి వంటకాలు అంటే అందరికీ సహజంగానే ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు తినేందుకు అనేక రకాల పిండి వంటలు అందుబాటులో ఉన్నాయి. అయితే బయట మార్కెట్లోనూ మనకు స్వగృహ ఫుడ్స్‌లో రకరకాల పిండి వంటలను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఇక ఎవరి ఇష్టానికి తగినట్లు స్వీట్ లేదా కారం ఆహారాలను కొని తింటుంటారు. అయితే ఏ వంటకం అయినా సరే వాటిల్లో చాలా వరకు నువ్వులను వాడుతారు. తీపి లేదా కారం వంటకాలు ఏవి అయినా నువ్వులు పడితే టేస్ట్ అదిరిపోతుంది. ఈ క్రమంలోనే నువ్వులతో చేసిన పలు వంటకాలను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే నువ్వులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజూ గుప్పెడు నువ్వులను నేరుగా అలాగే తినవచ్చు. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
నువ్వుల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అలాగే క్యాల్షియం, పలు రకాల బి విటమిన్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. 100 గ్రాముల నువ్వులను తినడం వల్ల మనకు సుమారుగా 500 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. 100 గ్రాముల నువ్వుల ద్వారా 23.4 గ్రాముల పిండి పదార్థాలు, 11.8 గ్రాముల ఫైబర్, 17.7 గ్రాముల ప్రోటీన్లు, 975 మిల్లీగ్రాముల క్యాల్షియం, 14.6 మిల్లీగ్రాముల ఐరన్, 629 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 468 మిల్లీగ్రాముల పొటాషియం, 351 మిల్లీగ్రాముల మెగ్నిషియం లభిస్తాయి. కనుక నువ్వులను పోషకాలకు గనిగా చెప్పవచ్చు.
నువ్వులలో క్యాల్షియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులను తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయట. కనుక నువ్వులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తింటే యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా లిగ్నన్స్ వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్, క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
నువ్వుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది లూబ్రికెంట్ మాదిరిగా పనిచేస్తుంది. అందువల్ల నువ్వులను రోజూ తింటే సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వుల్లో ఉండే కాపర్, మెగ్నిషియం కండరాల వాపులు, నొప్పులను తగ్గించడంతోపాటు అలర్జీల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నువ్వుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను త్వరగా అతుక్కునేలా చేస్తుంది. ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులను తింటుంటే షుగర్ లెవల్స్‌ను సైతం కంట్రోల్ చేయవచ్చు. ఇలా నువ్వులను రోజూ గుప్పెడు తింటుంటే ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.