Radish Benefits | ముల్లంగి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. తెలుపు రంగులో ఉండే ముల్లంగి ఒకటి అయితే.. పింక్ రంగులో ఉండే ముల్లంగి ఇంకో రకం. కానీ మనకు తెలుపు రంగులో ఉండే ముల్లంగి మాత్రమే మార్కెట్లో కనిపిస్తుంది. ముల్లంగి రుచికి ఘాటుగా ఉంటుంది. వాసన కూడా వస్తుంది. కనుక దీన్ని తినేందకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. ఇక కొందరు మాత్రం ముల్లంగిని చారు వంటి వంటకాల్లో వేస్తుంటారు. అయితే ముల్లంగిని నేరుగా తినడం ఇష్టం లేని వారు దీన్ని జ్యూస్‌లా చేసి కూడా తాగవచ్చు. రోజూ ఉదయం అర కప్పు ముల్లంగి రసం తాగితే అద్బుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పలు రకాల వ్యాధులకు ముల్లంగి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఆంథోసయనిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూస్తాయి. ముల్లంగిలో గ్లూకోసైనోలేట్స్, ఐసోథయోసయనేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ముల్లంగిని తింటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ముల్లంగిని తినడం వల్ల లిపిడ్ ప్రొఫైల్స్ కూడా మెరుగు పడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
ముల్లంగిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇవి షుగర్ పేషెంట్లకు వరమనే చెప్పవచ్చు. ముల్లంగి రసాన్ని రోజూ తాగుతుంటే శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముల్లంగిలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. బీపీని కంట్రోల్లో ఉంచుతాయి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముల్లంగిలో ఇండోల్-3-కార్బినాల్, 4-మిథైల్థియో-3-బ్యుటినైల్-ఐసోథియోసయనేట్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. లివర్‌లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లను బయటకు పంపుతాయి. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ముల్లంగిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొటాషియం, జింక్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి చర్మానికి కావల్సిన తేమను అందిస్తాయి. చర్మం వాపులకు గురి కాకుండా చూస్తాయి. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మం పగుళ్లు తగ్గిపోతాయి. ముల్లంగిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక ఫంగస్ ఇన్ఫెక్షన్లపై ముల్లంగి రసాన్ని రాస్తుంటే ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. అలాగే అధిక బరువు తగ్గేందుకు కూడా ముల్లంగి ఎంతగానో పనిచేస్తుంది. దీని రసాన్ని రోజూ సేవిస్తుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా ముల్లంగి రసాన్ని రోజూ సేవిస్తున్నా లేదా ముల్లంగిని తింటున్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ముల్లంగిని తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీలు కూడా దీన్ని ఉపయోగించకూడదు.