Banana | మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చాలా తక్కువ ధరను కలిగి ఉంటాయి. కనుక పేద వర్గాలకు చెందిన వారు కూడా ఈ పండ్లను సులభంగా కొని తినవచ్చు. అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. అయితే మనకు సాధారణ అరటి పండ్లు మార్కెట్లో ఎక్కువగా లభిస్తుంటాయి. కనుక వాటినే కొనుగోలు చేసి తింటుంటారు. ఇక అరటి పండ్లతో ఎన్నో రకాల స్వీట్లు, డ్రింక్స్ కూడా తయారు చేయవచ్చు. అయితే రోజుకు 3 అరటి పండ్లను తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు 3 అరటి పండ్ల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు.
రోజుకు 3 అరటి పండ్లను తినడం ద్వారా గుండె పోటుకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటిష్-ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజువారిగా 3 అరటి పండ్లను తిన్న వారిలో హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు ఒక అరటి పండు, భోజన సమయంలో ఒకటి, సాయంత్రం సమయంలో ఒక అరటి పండును తినే వారిలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయ పడుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలను 21 శాతం వరకు అరటి పండ్లు తగ్గిస్తాయని తేల్చారు.
ఇక నట్స్, చేపలు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం కన్నా రోజుకు 3 అరటి పండ్లను తింటే ఎంతో ఉత్తమమని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో గుండె పోటు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చని వారు అంటున్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని వారు చెబుతున్నారు. సోడియం అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల ప్రతి సంవత్సరం గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుందని వార్వింక్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గాలంటే పొటాషియం స్థాయిలను పెంచాల్సి ఉంటుంది. అందుకు గాను అరటి పండ్లు ఎంతగానో దోహద పడతాయి.
అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక రోజుకు 3 అరటి పండ్లను తింటే పొటాషియం సరిగ్గా లభిస్తుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. కాబట్టి రోజుకు 3 అరటి పండ్లను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు, అధికంగా బరువు ఉన్నవారు లేదా బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకు అరటి పండ్లను తినాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక అరటి పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జీర్ణ వ్యవస్థ సైతం మెరుగ్గా పనిచేస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. ఇలా అరటి పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.