Cloves | చలికాలం మరింత ముందుకు సాగింది. అనేక చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో చలి నుంచి తమను తాము రక్షించుకునేందుకు చాలా మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. చలికాలంలో చలి నుంచి రక్షణగా ఉండేందుకు చాలా మంది ఉన్ని దుస్తులను ధరిస్తుంటారు. అలాగే తీసుకునే ఆహారంలోనూ అనేక మార్పులు చేస్తుంటారు. అయితే చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో పలు ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిల్లో లవంగాలు కూడా ఒకటి. లవంగాలనుఈ సీజన్లో తీసుకోవడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే లవంగాలను తినడం వల్ల మనకు పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కనుక ఈ సీజన్లో లవంగాలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో మనం శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను ధరిస్తుంటాం. అయినప్పటికీ మన కాళ్లు, చేతులు చల్లగా మారుతుంటాయి. న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం మన శరీరంలో రక్త సరఫరా లేనందువల్లే కాళ్లు, చేతులు చల్లగా ఉంటాయట. అందుకనే మిగిలిన శరీరం మొత్తం వెచ్చగా ఉన్నప్పటికీ కాళ్లు, చేతులు చల్లగా ఉంటాయి. అయితే లవంగాలను తినడం వల్ల కాళ్లు, చేతులను కూడా పూర్తిగా వెచ్చగా ఉంచుకోవచ్చు. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చలికాలంలో కచ్చితంగా లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో కాళ్లు, చేతులకు రక్తం సరిగ్గా సరఫరా అవుతుంది. ఫలితంగా ఆయా భాగాలు కూడా వేడిగా ఉంటాయి. లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలను వెడల్పుగా చేస్తుంది. దీంతో రక్త సరఫరా పెరుగుతుంది. ఫలితంగా చల్లగా ఉండే చేతులు, కాళ్లు కూడా వెచ్చగా మారుతాయి. ఇక లవంగాలను తినడం వల్ల పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాల్లో యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం జెర్మిసైడల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో ఉండే పుండ్లు కూడా తగ్గుతాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
లవంగాలను తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. లవంగాలను తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. లవంగాలు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో చర్మం మృదువుగా మారి మెరుస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా లవంగాలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.