Brinjal | మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలతో ఏ కూర చేసినా చాలా రుచిగా ఉంటుంది. వంకాయల్లో మనకు పలు రకాల కాయలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతికంగా చెప్పాలంటే వంకాయలు పండ్ల జాబితాకు చెందుతాయి. కానీ వీటిని మనం కూరగాయల్లా ఉపయోగిస్తున్నాం. అయితే వంకాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంకాయలను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. వంకాయల్లో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకల నిర్మాణానికి సహాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. పిండిపదార్థాలను సరిగ్గా జీర్ణం చేసేందుకు పనిచేస్తుంది. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది.
వంకాయల్లో ఫోలేట్ (విటమిన్ బి9) అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. గర్భంతో ఉన్న మహిళలకు ఈ పోషక పదార్థం ఎంతగానో మేలు చేస్తుంది. పుట్టబోయే పిల్లల్లో లోపాలు రాకుండా ఉంటాయి. వంకాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కండరాల పనితీరు మెరుగు పడుతుంది. వంకాయల్లో విటమిన్లు కె, సి అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.
వంకాయల్లో ఆంథో సయనిన్స్ ఉంటాయి. అందుకనే ఈ కాయలు పర్పుల్ రంగులో ఉంటాయి. నాసునిన్ అనే సమ్మేళనం కూడా వీటిల్లో ఉంటుంది. వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణజాలం డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల చర్మ కణజాలం సురక్షితంగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వంకాయల్లో ఉండే ఆంథో సయనిన్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో తీవ్రమైన వాపులను సైతం తగ్గిస్తాయి. కనుక ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వీటిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పోటు రాకుండా నివారించవచ్చు. వంకాయలను తరచూ తింటే పొటాషియం లభించి శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో బీపీ అదుపులోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ కాయలు ఎంతగానో మేలు చేస్తాయి. వంకాయల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పొట్ట నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. వంకాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరగవు. పైగా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు వంకాయలను తింటుంటే మేలు జరుగుతుంది. ఇలా వంకాయలను తరచూ తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.