Bachalikura | మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. అలాంటి వాటిల్లో చాలా వరకు మొక్కలకు చెందిన ఆకులను మనం కూరగా కూడా వండుకుని తింటుంటాం. అవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అయితే మన చుట్టూ పరిసరాల్లో అలాంటి కొన్ని రకాల మొక్కలు ఉంటాయి కానీ వాటన్నింటినీ మనం గుర్తించలేం. వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తుంటారు. కానీ అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని మాత్రం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో బచ్చలికూర కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. మార్కెట్లోనూ మనకు అప్పుడప్పుడు బచ్చలికూర కనిపిస్తుంది. అయితే దీన్ని చాలా మంది తినరు. కానీ దీన్ని తింటే అనేక లాభాలు కలుగుతాయి. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు. అనేక పోషకాలను సైతం పొందవచ్చు. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది. బచ్చలికూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బచ్చలికూరను మలబార్ స్పినాచ్ అని కూడా అంటారు. ఇది చూసేందుకు కాస్త పాలకూరను పోలి ఉంటుంది. కానీ రుచి అద్భుతంగా ఉంటుంది. బచ్చలికూరను నేరుగా కూర చేసుకుని తినవచ్చు. లేదా పప్పులా చేసి తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆకులను జ్యూస్‌గా చేసి కూడా తాగవచ్చు. బచ్చలి కూరను తింటే విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. పాలకూర కన్నా ఇందులోనే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. బచ్చలికూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రోగాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. కనుక మలబద్దకం ఉన్నవారు బచ్చలికూరను రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఈ ఆకుల్లో అధికంగా ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఈ ఆకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటుంటే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తాయి. కనుక హైబీపీ ఉన్నవారికి ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఆకుల్లో బీటా కెరోటిన్, లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గేలా చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
బచ్చలికూరలో ఉండే సమ్మేళనాలు లివర్, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులను రోజూ తింటే లివర్, కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి ఆయా అవయవాలు శుభ్రంగా మారుతాయి. ఫ్యాటీ లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ ఆకులు మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించుకోవచ్చు. ఇక 100 గ్రాముల బచ్చలికూరను తింటే కేవలం 19 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. 93 గ్రాముల నీరు ఉంటుంది. ప్రోటీన్లు 1.8 గ్రాములు, పిండి పదార్థాలు 3.4 గ్రాములు, ఫైబర్ 3.7 గ్రాములు ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఈ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇలా బచ్చలికూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.