Tiger Nuts | బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు.. ఇలా చాలా రకాల నట్స్ గురించి మనకు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా టైగర్ నట్స్ గురించి విన్నారా..? వీటిని మీరు సూపర్ మార్కెట్లలో చూసే ఉంటారు. కానీ వీటి పేరు టైగర్ నట్స్ అని మీకు తెలిసి ఉండదు. ఇతర నట్స్ లాగే ఈ నట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవచ్చు. టైగర్ నట్స్‌ను చుఫా లేదా ఎర్త్ ఆల్మండ్స్ అని పిలుస్తారు. అయితే ఇవి నట్స్ జాబితాకు చెందుతాయి. కానీ భూగర్భంలో పండుతాయి. ఈ నట్స్ మీద ముడతలు పడినట్లు తొక్క ఉంటుంది. ఇవి కాస్త తియ్యగా, క్రీమ్ రుచిని కలిగి ఉంటాయి. సాధారణ నట్స్ అంటే అలర్జీ ఉన్నవారు టైగర్ నట్స్‌ను తీసుకోవచ్చు. టైగర్ నట్స్‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ నట్స్‌ను తింటుంటే పలు వ్యాధులు నయం అవుతాయని అంటున్నారు.
టైగర్ నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. ఈ నట్స్‌లో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది కూడా ఫైబర్ లాగే పనిచేస్తుంది. ఈ నట్స్‌ను తింటే ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. దీని వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. టైగర్ నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి మెరుగు పడుతుంది. ముఖ్యంగా అమైలేజ్, లైపేజ్, కాటలేజ్ అనే ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి.
టైగర్ నట్స్‌ను తింటే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టైగర్ నట్స్‌లో అర్గైనైన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు రోజూ ఈ నట్స్‌ను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ నట్స్‌లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను, రక్త నాళాలను సంరక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.
టైగర్ నట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ నట్స్‌లో ఉండే ఆర్గైనైన్ అనే సమ్మేళనం ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ నట్స్‌ను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. టైగర్ నట్స్‌లో విటమిన్ సి, ఇ అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఎక్కువగానే ఉంటాయి, ఇవి ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఈ నట్స్‌లో అధికంగా ఉండే జింక్, ఐరన్ రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. టైగర్ నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నట్స్‌ను తింటే బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. ఇలా టైగర్ నట్స్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.