Children foods @ Winter | చలికాలం వచ్చిందంటే చాలు చిన్నారులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. వారికి ఎలాంటి ఆహారాలను ఇవ్వడం ద్వారా వారిలో ఇమ్యూనిటీ పెంచవచ్చో తెలియక చాలా మంది తల్లులు ఇబ్బంది పడుతుంటారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే చాలా మంది చిన్నారులు వ్యాధినిరోధకతను కోల్పోయి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవ్వడం వల్ల వారు ఫ్లూ లేదా ఇతర కాలానుగుణ వైరస్ బారిన పడే అవకాశం తగ్గుతుందని ప్రతి తల్లీ గమనించాలి.
బెల్లం : ప్రోటీన్, కోలిన్, బీటైన్, విటమిన్ బీ12, బీ6, ఫోలేట్, కాల్షియం, ఐరన్‌తో పాటు అనేక ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది. పిల్లల సాధారణ ఆరోగ్యానికి బెల్లం ఎంతో అద్భుతమైన ఆహారం. చలికాలంలో పిల్లలకు బెల్లంతో చేసిన ఆహారాలను అందివ్వాలి.
కోడిగుడ్లు : చలికాలంలో చిన్నారులకు నిత్యం కోడిగుడ్డు తినిపించాలి. గుడ్డులో అనేక ప్రోటీన్లు, పోషకాలు పిల్లలకు అందుతాయి. ఒకేమాదిరిగా కాకుండా బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ రైస్, ఫ్రైఎగ్.. ఇలా రకరకాల ఆహారాలు ఇవ్వడం వల్ల వారు హాయిగా తింటాంటారు.
స్వీట్ పొటాటో : వీటిలో విటమిన్లు, ఫైబర్, కీలక మూలకాలు ఎన్నో ఉంటాయి. మంచి రుచిని ఇవ్వడమే కాకుండా పిల్లల రక్షణను బలోపేతం చేస్తుంది.
ఉసిరి : వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లూ, జలుబు, జీర్ణ సమస్యలు వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఖర్జూరం : ఖర్జూరం పండ్లు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి. ఇవి హార్మోన్ నియంత్రణ, వాపు తగ్గింపు, రోగనిరోధకత పెంపుదలకు మద్దతుగా నిలుస్తాయి. ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
సిట్రస్ జాతి పండ్లు : సీ విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను ఎక్కువగా తినిపించాలి. ఇవి చిన్నారుల్లో వ్యాధినిరోధక వ్యవస్థకు గణనీయంగా సహాయపడతాయి.
బీట్రూట్ : వీటిలో అధిక మొత్తంలో పీచు ఉండి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే, రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల నివారణలో సాయపడుతుంది.
టర్నిప్ : ఆస్కార్బిక్ యాసిడ్, సీ విటమిన్‌తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉండి రోగనిరోధక శక్తి పెరిగడంలో సహాయపడతాయి. ఇవి బయటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి.
సూప్‌లు : చలి వాతావరణంలో వేడిని అందించేందుకు పిల్లలకు ఎక్కువగా సూప్‌లు ఇవ్వాలి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. సూప్‌లలో పాలకూర, బ్రోకలి, మష్రూమ్, బీన్స్, బీట్రూట్, చికెన్ ముక్కలు, మటన్ స్టిక్స్ వంటివి కూడా చేర్చి రుచి, శక్తిని మెరుగుపర్చవచ్చు.
నట్స్ : చలికాలంలో వెచ్చగా ఉండటంలో నట్స్ ఎక్కువగా సాయపడతాయి. జీడిపప్పు, బాదాం, వేరుశనగ, పిస్తా, వాల్నట్ వంటివి ఎక్కువగా తినిపించాలి. నేరుగా తినకపోతే పొడిగా చేసి కూరల ద్వారా అందివ్వాలి. ఇవి రోజంతా స్నాక్స్‌గా పనిచేస్తాయి.