ముఖ నిర్మాణంలో దంతాలు కీలకం. ఆహారం నమలడానికి మాత్రమే కాకుండా దంతాలు మనిషి ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. పంటినొప్పి వస్తే కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితి తలెత్తుతుంది. అయితే, దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇక కొన్ని రకాలైన వ్యాధులు శరీరంతోపాటు మన దంతాలపైనా దుష్ప్రభావం చూపుతాయి. వాటిలో ముఖ్యమైంది మధుమేహం. మామూలుగా అయితే డయాబెటిస్ కిడ్నీలు, గుండె తదితర అవయవాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలాంటిది డయాబెటిస్ దంతాలపై ఎలా ప్రభావం చూపుతుంది? దానివల్ల తలెత్తే ఇతర అనారోగ్య సమస్యల గురించి నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
మధుమేహం జీవనశైలి వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడమే డయాబెటిస్. అయితే మధుమేహం అదుపులో లేకపోతే అది రోగి శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో దంతాలు కూడా ఉండటం గమనార్హం. షుగర్ వల్ల దంతాలు ప్రత్యక్షంగా దెబ్బతినవు. చిగుళ్ల వ్యాధులు అధికంగా వస్తాయి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఏర్పడి అవి వాపునకు గురవుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చిగుళ్లలో ఇన్పెక్షన్ పెరిగిపోయి దంతాల చుట్టూ ఉండే దవడ ఎముక క్రమంగా కోతకు లోనవుతుంది. దవడ ఎముక విరిగిపోవడం వల్ల దంతాలు వదులైపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఊడిపోతాయి.
సాధారణంగా డయాబెటిస్ టైప్-1, టైప్-2 అని రెండు రకాలు. టైప్-1 డయాబెటిస్ రోగుల్లో జన్యుపరంగానే ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. టైప్-1 జువెనైల్ డయాబెటిస్ (బాల్యంలోనే మధుమేహం) రోగుల్లో 20 ఏళ్ల లోపే మోలార్ (నమిలే) దంతాలు ఊగిపోతాయి. అంటే ఎవరిలోనైనా నాలుగు మోలార్ దంతాలు వదులైతే వారిని టైప్-1 డయాబెటిస్ రోగులుగా పరిగణిస్తారు. ఇక టైప్-2 రోగుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ అది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించలేదు. అయితే, టైప్-1, టైప్-2 డయాబెటిస్లు రెండూ కూడా దంతాలపై ప్రభావం చూపుతాయి. ఎక్కువమందిలో టైప్-2 డయాబెటిస్ కనిపిస్తుంది.
గర్భిణుల్లో హార్మోన్ల మార్పుల వల్ల కొంతమందిలో చక్కెర స్థాయులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇలా గర్భ ధారణ సమయంలో డయాబెటిస్ రావడాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అయితే, ప్రసవం తర్వాత 90 శాతం మందికి చక్కెర స్థాయులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. కానీ, చక్కెర స్థాయులు అధికంగా ఉన్న గర్భిణులకు సైతం మధుమేహ రోగుల్లోలానే చిగుళ్లు, దంతాలపై దుష్ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్రధానంగా 6 రకాల దంత సమస్యలు కనిపిస్తాయి. అవి..
పిప్పిపళ్లు : తీసుకునే ఆహారంలోని చక్కెరలు, స్టార్చ్‌లు నోటిలో ఉన్న బ్యాక్టీరియాతో చర్య జరుపుతాయి. దీనివల్ల దంతాలపై పల్చటి జిగురుపొర (ప్లాక్) ఏర్పడుతుంది. ఈ పొరలోని యాసిడ్స్ పంటి పైభాగంలోని ఎనామిల్ డెంటిన్‌ను దెబ్బతిస్తాయి. దీంతో పిప్పిపళ్లు ఏర్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయుల మోతాదు ఎంత పెరిగితే అంతగా ఈ పొర ఏర్పడుతుంది. యాసిడ్స్ పెరిగి పిప్పిపళ్ల సమస్య తీవ్రమవుతుంది.
చిగుళ్ల వ్యాధులు : డయాబెటిస్ వచ్చినప్పుడు నోటిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల ఏర్పడిన ప్లాక్ గట్టిపడుతుంది. దీన్ని ‘టార్టార్’ (పళ్లపై గార) అంటారు. ఈ గార బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. అలా చిగుళ్లకు దురద (ఇరిటేషన్) కలిగిస్తుంది. దీంతో చిగుళ్లు వాచిపోవడం, రక్తం కారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యనే జింజివైటిస్ అంటారు. దీన్ని చిగుళ్ల వ్యాధి మొదటి దశగా భావించవచ్చు.
పెరియోడాంటైటిస్ : జింజివైటిస్‌కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది పంటి కింద ఉన్న ఎముకను తినేయడం మొదలుపెడుతుంది. దీంతో పన్ను ఊగడం లేదా ఊడిపోవడం జరుగుతుంది. పెరియోడాంటైటిస్ అంటే ఇదే. ఈ సమస్య సాధారణ రోగుల కంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మూడు రెట్లు ఎక్కువ. దీని కారణంగా మధుమేహ రోగుల్లో దంతాలు కదిలిపోతాయి. అంతేకాకుండా చిగుళ్లవాపు, చిగుళ్ల నుంచి చీము కారడం సంభవిస్తాయి.
థ్రష్ : నాలుకపై ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడాన్ని థ్రష్ అంటారు. దీనివల్ల నాలుకపై తెలుపు లేదా ఎర్ర రంగు ప్యాచ్ ఏర్పడుతుంది. ఇది కొంత నొప్పిగా ఉంటుంది. మధుమేహ రోగుల్లో థ్రష్ సమస్యను అధికంగా చూస్తుంటాం.
డ్రై మౌత్ : నోటిలో లాలాజలం తగ్గినప్పుడు నోరు పొడిబారుతుంది. దీనినే డ్రై మౌత్ అంటారు. లాలాజలం నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. యాసిడ్స్‌ను తటస్థపరుస్తుంది. అలా నోటిలో ఆమ్ల గుణాన్ని తగ్గిస్తుంది. లాలాజలం తగ్గడం వల్ల యాసిడ్స్ స్థాయులు అధికమై, నోరు అపరిశుభ్రంగా మారుతుంది. దీంతో పిప్పిపళ్లు తదితర సమస్యలు ఏర్పడతాయి.
నోటి దుర్వాసన : మధుమేహ రోగుల్లో నోటిలో దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం డయాబెటిస్ వల్ల నోటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏర్పడటమే.
డయాబెటిస్ రోగులకు దంత సమస్యలు వస్తే సాధారణ రోగులకు చేసినంత సులువుగా చికిత్స చేయలేం. ఎందుకంటే డయాబెటిస్ రోగులకు గాయం త్వరగా మానదు. అందువల్ల దంత సమస్యలున్న మధుమేహ రోగులకు దంతాలకు సంబంధించిన శస్త్రచికిత్స వంటివి చేయాలంటే షుగర్ పూర్తిగా అదుపులో ఉండాల్సిందే. లేకపోతే చికిత్స కష్టం.
సాధారణంగా డయాబెటిక్ రోగుల్లో రోగ నిరోధక శక్తి ప్రతిస్పందన ఇమ్యూన్ రెస్పాన్స్ తగ్గుతుంది. అంటే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా అధికంగా అభివృద్ధి చెంది నోటిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో గాయం మానే శక్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా మధుమేహం ఉన్నవాళ్లకు నోటి వ్యాధులు పెరుగుతాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతుంది. కాబట్టి, నోటిలో ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైపోతుంటుంది. అంటే నోటిలో ఇన్ఫెక్షన్ పెరిగితే మధుమేహం పెరుగుతుంది. మధుమేహం పెరిగితే నోటిలో ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఇవి పరస్పర ఆధారితం అని గుర్తుపెట్టుకోవాలి.
విదేశాల్లో మాదిరిగా మన దగ్గరా ప్రభుత్వాలే చొరవ తీసుకుని ప్రతి సంవత్సరం ప్రతి పౌరుడికీ బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సాధారణ వైద్య పరీక్షలను ఉచితంగా చేయించాలి. దీనివల్ల వ్యాధులు నియంత్రణలో ఉండటానికి, లేదా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా వివిధ వ్యాధుల రోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రజలు కూడా ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించాలి.
…?మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ సుఖభోగి జగదీశ్వర్‌రావు
ఆర్ఎంఓ, పబ్లిక్ హెల్త్ విభాగ అధిపతి
ప్రభుత్వ దంత కళాశాల
అఫ్జల్‌గంజ్, హైదరాబాద్