ఇటీవల రాజ్యసభలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధామూర్తి ఓ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. మహిళలను పట్టిపీడిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైన గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ గురించి సుధామూర్తి ప్రభుత్వాల విధానాలు ఎలా ఉండాలో పెద్దల సభ వేదికగా అమూల్యమైన సూచనలు చేశారు.

రాజ్యసభలో నా మొదటి ప్రసంగం సందర్భంగా నా హృదయానికి దగ్గరగా ఉండే అంశం గురించి ప్రస్తావించాలని అనుకుంటున్నాను. డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన నేను, మహిళల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని, అయితే అది నిర్లక్ష్యానికి గురయిందని గ్రహించాను.
ఈ అంశాలే మహిళలకు సురక్షితమైన ఆరోగ్యరక్షణ వ్యవస్థను సృష్టించాల్సిన ప్రాధాన్యత గురించి నాకు నేర్పించాయి.
ప్రస్తుతం భారతదేశపు మహిళల్లో క్యాన్సర్ మరణాలకు కారణమవుతున్న వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండోది. కాబట్టి, మహిళలకు చిన్నతనంలోనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాను అందుబాటులో ఉంచడం అనేది ఈ విషయంలో మార్పుదిశగా వేసే తొలి అడుగుగా భావించాలి.
ఈ వ్యాధి ప్రబలంగా ఉండటానికి ప్రధానంగా… అవగాహన లేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల అందుబాటు తక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యరక్షణ మౌలికవసతులు తగినన్ని లేకపోవడం లాంటివి కారకాలుగా నిలుస్తాయి. అయితే, దీనికి ప్రాథమిక ముప్పు కారకం మాత్రం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ఇన్ఫెక్షన్.
కాగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా జాగ్రత్త వహించే ప్రివెంటివ్ కేర్ విషయంలో సామాజిక ఆర్థిక అంతరాలు, సాంస్కృతిక అవరోధాలు ముప్పును మరింత పెంచుతున్నాయి. కాబట్టి, సర్వైకల్ క్యాన్సర్‌పై పోరాటంలో ప్రభుత్వం స్వయంగా టీకా కార్యక్రమం చేపట్టాలి.
తొమ్మిది నుంచి పద్నాలుగేండ్ల వయసు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే టీకాలు ఇస్తున్నారు. కాబట్టి మన బాలికలకు ప్రయోజనం కలిగించే ఈ టీకాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చికిత్స కంటే వ్యాధి రాకుండా నివారించడం మంచిది కదా!
కొవిడ్-19 సమయంలో ప్రభుత్వం టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 9 నుంచి 14 ఏండ్ల అమ్మాయిలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకా కార్యక్రమం కూడా ప్రభుత్వమే చేపడితే బాగుంటుంది.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాలు బాగా పనిచేస్తున్నాయి. పైగా ఇవంత ఖరీదైనవి కూడా కాదు. ఇప్పుడు 1,400 రూపాయలు ఉన్న టీకా ఖరీదును 700 నుంచి 800 రూపాయలకు తగ్గించగలగాలి. ఈ దిశగా ప్రభుత్వం టీకా తయారీదారులతో మాట్లాడి ఒప్పించాలి. ఇది మన బాలికల భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.