లండన్ : ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తీసుకునే ప్రొబయాటిక్స్ క్యాప్సుల్‌తో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునే ప్రక్రియ వేగవంతమవుతుందని తాజా అధ్యయనం వెల్లడిచింది. మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉండే ప్రోబయాటిక్స్ ట్యాబ్లెట్లు, పానీయాలు గట్ మైక్రోబయోమ్‌ను బలోపేతం చేస్తాయి. ఈ ప్రొబయాటిక్స్ టైప్ 2 మధుమేహం నుంచి కుంగుబాటు ముప్పునూ నివారిస్తుండగా ఇప్పుడు మన ప్రేవుల్లో ఉండే బ్యాక్టీరియా కొవిడ్‌ను దీటుగా ఎదుర్కొంటుందని జర్నల్ గట్ మైక్రోబ్స్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. పరిశోధనలో భాగంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన 300 మంది కొవిడ్ రోగుల్లో సగం మందికి ప్రొబయోటిక్ క్యాప్సుల్ ఇచ్చారు. వీరిలో ఇతరులతో పోలిస్తే 53 శాతం మంది నెలరోజుల్లో కొవిడ్ లక్షణాల నుంచి బయటపడ్డారు.
ప్రొబయోటిక్స్లో ఉండే ల్యాక్టోబసిలస్ పలు వ్యాధులతో శరీరంలో తలెత్తే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. లాంగ్ కొవిడ్‌తో బాధపడేవారి ప్రేవుల్లో ల్యాక్టోబసిలస్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో తేలింది. దీంతో శరీరమంతటా వాపు ప్రక్రియ వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. ప్రొబయాటిక్స్ క్యాప్సుల్ తీసుకున్న వారు వేగంగా కోలుకోవడంతో పాటు వారిలో వైరల్ లోడ్ తక్కువగా ఉందని కనుగొన్నారు. ప్రొబయాటిక్స్ వాపు ప్రక్రియను తగ్గించి ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయని సౌతాంప్టన్ యూనివర్సిటీ న్యూట్రిషనల్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్ ఫిలిప్ కాల్డర్ పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ప్రొబయాటిక్స్ సప్లిమెంట్స్‌తో మైక్రోబయోమ్ ఆరోగ్యం మెరుగవుతుందని లండన్ కింగ్స్ కాలేజ్‌కు చెందిన జెనెటిక్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ చెప్పారు. అయితే ఇది అందరికీ సరిపడదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 60 ఏండ్ల పైబడిన వారిపై పరిశోధన జరగలేదని, పాల్గొన్నవారు టీకా తీసుకున్నారా లేదా అనే వివరాలు లేవని యూనివర్సిటీ కాలేజ్ లండన్ మైక్రోబయల్ వ్యాధుల నిపుణులు ప్రొఫెసర్ అండ్రూ స్మిత్, ప్రొఫెసర్ డాక్టర్ పాల్ గిల్ ఆక్షేపించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రొబయాటిక్స్ సప్లిమెంట్స్ తీసుకుంటే అనర్ధాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు.