న్యూఢిల్లీ : ఆరోగ్యంగా, సంతోషంగా, చలాకీగా దీర్ఘకాలం బతికేయాలంటే మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ప్రాసెస్డ్, రిఫైన్డ్ ఫుడ్, షుగర్, ట్రాన్స్‌ఫ్యాట్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఆరోగ్యకర ఆహారాన్నే స్వీకరిస్తూ ఆత్మీయులతో కలకలం ఆనందంగా బతికిన వారిని ఇందుకు ఆదర్శంగా పరిశోధకులు చూపుతున్నారు. జపాన్, గ్రీస్, కోస్టారికా, ఇటలీ వంటి దేశాల్లోని పలు ప్రాంతాల ప్రజలు తీసుకునే బ్లూజోన్ డైట్‌ను అద్భుత ఆహారంగా ముందుకు తెస్తున్నారు. ఈ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యంగా, దీర్ఘాయువుతో ఉండటమే అందుకు కారణమని చెబుతున్నారు.
రోజూ నిర్ధిష్ట ఆహారపు అలవాట్లను పాటించడమే వారి దీర్ఘాయువు రహస్యమని అంటున్నారు. వారు తీసుకుంటున్న సూపర్ ఫుడ్‌ను మన ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ ఆహారంలో బీన్స్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. బీన్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు, ఇతర పోషకాలు వ్యాధులతో పోరాడతాయి. వీటిని నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వ్యాధులను దరిచేరనీయకుండా చూస్తాయి. ఇక కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆలూను తినాలంటే మనలో చాలా మంది వెనుకాడుతుంటారు. అయితే దీర్ఘాయువు ఎక్కువగ ఉండే గ్రీస్, జపాన్ దేశాల్లో వీటిని అక్కడి ప్రజలు నిత్యం తీసుకుంటారు. ఆలూను ఆహారంలో భాగం చేసుకోవడం వల్లే గ్రీకు ప్రజలు రక్తపోటు, మధుమేహాన్ని సులభంగా అదుపులో ఉంచుకోగలుగుతున్నారని పరిశోధకులు వెల్లడించారు.
స్వీట్ పొటాటోల్లో ఫైబర్, పొటాషియం, విటమిన్ సీ, బీ6, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇక మన వంటింట్లో వాడే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. వెల్లుల్లి జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా ఇందులో ఉండే వాపు నిరోధక ఔషధాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడి క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల ముప్పును నివారిస్తాయి. వయో సంబంధ సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. ఇక గ్రీస్‌లో ఎక్కువగా ఆలివ్ ఆయిల్‌తో చేసిన వంటకాలను తీసుకుంటారు. ఎక్ట్ర్సా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మరోవైపు దేశీ కూరగాయగా అందరి వంటిళ్లలో నిత్యం ఉపయోగించే టమాట కూడా బ్లూజోన్ డైట్లో కీలక ఆహారంగా ముందుకొచ్చింది. టమాటలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర ఔషధ గుణాలు గుండె జబ్బు సహా పలు అనారోగ్యాలను నివారిస్తాయి.