న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏం తింటున్నామో ఎంతటి ఒత్తిడికి గురవుతున్నామో చెక్ చేసుకునే తీరిక మనకు దొరకడం లేదు. జంక్ ఫుడ్, ట్రాన్స్‌ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకుంటుండటంతో కొలెస్ట్రాల్ బారినపడి గుండె జబ్బుల ముప్పు అధికమవుతోంది. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకర అలవాట్లను అలవరుచుకోవాలని వైద్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగ్గా ఉంచేందుకు సాల్మన్ చేపలు, వాల్ నట్స్, అవిశె గింజలు, తాజా కూరగాయలు వంటి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. వీటిలో లభించే ఆరోగ్యకర కొవ్వులు స్ట్రోక్, గుండె వ్యాధుల ముప్పును నివారిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక నిత్యం అరగంట పాటు యోగ, స్విమ్మింగ్, రన్నింగ్, వాకింగ్, జాగింగ్ వంటి ఏదో ఒక వ్యాయామాన్ని ఎంచుకుని శరీరంలో కదలికలు ఉండేలా చూసుకోవాలి.
గుండె ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత కీలకం. నిత్య జీవితంలో ఒత్తిడితో పలు రకాల అనారోగ్యాలు శరీరాన్ని బాధిస్తాయి. ఒత్తిడి హృద్రోగుల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మరింత పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఇక కంటినిండా కునుకు తీయాలని నిద్ర లేమితో ట్రైగ్లిజరైడ్లు పెరిగి ఆరోగ్యకర కొవ్వు హెచ్‌డీఎల్ లెవెల్స్ తగ్గే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. గుండె ఆరోగ్యం కోసం రోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం.