Stress Symptoms | ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వారితోపాటు బయట పనిచేసేవారు, ఇతర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారిని ఒత్తిడి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒత్తిడి కారణంగా మానసిక సమస్యలు వస్తున్నాయి. ఆందోళన, డిప్రెషన్‌కు గురవుతున్నారు. అయితే కొందరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటారు. వారిపై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ సంతోషంగా ఉన్నట్లు భావిస్తారు. అయితే వాస్తవానికి ఎవరికైనా సరే ఒత్తిడి ఉంటే శరీరం పలు లక్షణాలను తెలియజేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించడం ద్వారా ఎవరైనా సరే ఒత్తిడితో బాధపడుతున్నారని చెప్పవచ్చని అంటున్నారు.
ఒత్తిడి అధికంగా ఉంటే మన శరీరం పలు హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. వీటినే స్ట్రెస్ హార్మోన్లు అని కూడా అంటారు. కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లను మన శరీరం ఒత్తిడి సమయంలో విడుదల చేస్తుంది. తీవ్రమైన ఒత్తిడి ఉంటే ఒక్కో వ్యక్తిలో భిన్న లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. కొందరికి చర్మ సమస్యలు వస్తుంటాయి. ఇంకా కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కొందరు గుండె జబ్బుల బారిన పడతారు. ఇంకా కొందరిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా, లేదా.. అన్న విషయం సులభంగా తెలిసిపోతుంది. దీంతో తగిన విధంగా జాగ్రత్త పడవచ్చు.
ఒత్తిడి అధికంగా ఉన్నవారిలో తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో పలు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి అధికంగా ఉన్నవారిలో కడుపు నొప్పి వస్తుంటుంది. వికారంగా కూడా ఉంటుంది. అజీర్తి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తుంటే ఒత్తిడి ఉందని గుర్తించాలి. ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారిలో శరీరంలో ఆయా భాగాల్లో నొప్పులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మెడ, భుజాలు, వెన్ను భాగాల్లో నొప్పి వస్తుంటుంది. తరచూ కూర్చుని పనిచేసేవారికి ఈ నొప్పులు సహజమే. కానీ తరచూ ఈ నొప్పులు వస్తుంటే మాత్రం ఒత్తిడి బారిన పడ్డారో లేదో చెక్ చేసుకోవాలి.
ఒత్తిడి వల్ల కొన్ని సార్లు తీవ్రమైన ఆందోళన వస్తుంది. అలాగే తలనొప్పిగా కూడా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో మైగ్రేన్‌కు దారి తీస్తుంది. తల, మెడ వద్ద ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. ఆయా భాగాల్లో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి కారణంగా తలనొప్పి అనేది తరచూ వస్తుంటుంది. కొన్ని సార్లు ఈ తలనొప్పి మరీ తీవ్రంగా మారుతుంది. ఇది తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పేందుకు సంకేతం. అలాగే ఒత్తిడి అధికంగా ఉంటే బీపీ నియంత్రణలో ఉండదు. ఇది దీర్ఘకాలలో హైబీపీకి దారి తీస్తుంది. దీంతో గుండె జబ్బులు కూడా వస్తాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఒత్తిడి అధికంగా ఉందని భావించాలి. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.