జంక్ ఫుడ్లో ఎక్కువమొత్తంలో శాచురేటెడ్ కొవ్వులు, రిఫైన్డ్ చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ప్రధానంగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి ఇవెంతో ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. క్రమం తప్పకుండా జంక్ ఫుడ్ తింటూ ఉంటే కాలేయ వ్యాధులు ముమ్మరిస్తాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. భారతదేశంలో కాలేయ వ్యాధుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రముఖంగా ఉండటం ఆందోళనకర పరిణామం.
శరీర జీవక్రియలను క్రమబద్ధం చేయడం, శరీరం నుంచి మలినాలను బయటికి పంపించే డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో కాలేయానిది కీలక పాత్ర. మనం సాధారణంగా తినే ఫాస్ట్ ఫుడ్స్, చక్కెర పానీయాలు, ప్యాకేజ్డ్ చిరుతిండ్లు, వేపుడు పదార్థాల్లో ట్రాన్స్ఫ్యాట్స్, సరళ కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం పనితీరుకు చేటు చేస్తాయి. కాలక్రమంలో కాలేయ కణాల్లో అధిక కొవ్వు పేరుకుపోతుంది. ఇది ఎన్ఏఎఫ్ఎల్డీకి సూచిక అయిన హెపాటిక్ స్టియటోసిస్కు దారితీస్తుంది.