రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో వేసేసుకోకుండా.. జీర్ణవ్యవస్థ సంక్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి. ఫైబర్ సమృద్ధిగా ఉన్నవి, ప్రొబయోటిక్ పదార్థాలను భోజనంలో భాగం చేసుకోవాలి. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.
మొరంగడ్డ, పాలకూర, బీట్రూట్, క్యారట్ లాంటివి పొట్టకు మంచి చేసే ఫైబర్ గనులు. తాజా పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువే. ధాన్యం కూడా బాగా మరాడించినవి కాకుండా ముతకవాటిని ఎంచుకోవాలి. యోగర్ట్, పెరుగు లాంటి ప్రొబయోటిక్ పదార్థాలు కూడా పొట్టలో బ్యాక్టీరియాకు మంచి మిత్రులు.
వ్యాయామం శరీరాన్ని మాత్రమే కాదు పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక అతిగా మద్యం తాగడం శరీరానికి మాత్రమే కాదు, పొట్టలోని మంచి సూక్ష్మజీవులకూ చెరుపు చేస్తుంది. కాబట్టి, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. మన ఆరోగ్యం పొట్ట- మెదడు అనుసంధానం మీద ఆధారపడి ఉంటుంది.
అందుకే పొట్టను రెండో మెదడు అంటారు. అందువల్ల మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. మల విసర్జన క్రమంలో మార్పులు, అసాధారణంగా బరువు తగ్గడం మలద్వారం నుంచి రక్తం పడుతున్నదంటే పొట్ట ఆరోగ్యంగా లేనట్టే. రోగ నిర్ధారణ, తగిన చికిత్స కోసం సంబంధిత వైద్యులను సంప్రదించాలి.